కిరణ్ తప్పటడుగు వేసారా?

 

మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని దిక్కరిస్తూ తన సమైక్య వాదనలతో సీమాంధ్ర ప్రజలను చాలా బాగా ఆకట్టుకొన్నారు. అగ్నికి వాయువు తోడయినట్లుగా ఆయనకు ఏపీ యన్జీవో నేత అశోక్ బాబు, ఆయన వెనుక లక్షలాది ఉద్యోగులు కూడా తోడవడంతో ఇక ఆయన చెలరేగిపోయారు. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయనను వేలెత్తి చూపే దైర్యం చేయలేకపోయారు. ఆ ఊపులోనే ఏపీఎన్జీజీవోలు హైదరాబాదులో ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభను విజయవంతంగా నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఉండి ఉంటే, ఆయనకు ఇక సీమాంధ్రలో తిరుగే ఉండేది కాదు. కానీ, ఆయన ఉదృతంగా సాగిన ఏపీయన్జీవోల సమ్మెకు బ్రేకులు వేసి, డిల్లీలో జీ.ఓ.యం. రాష్ట్ర ప్రక్రియను చకచకా పూర్తి చేస్తుంటే, ఆయన శాసనసభకు టీ-బిల్లు వచ్చేవరకు గోళ్ళు గిల్లుకొంటూ కూర్చోవడంతో ఆయనపై ప్రజలలో అనుమానాలు మొదలయ్యాయి. ఆసమయంలో ఆయన దూకుడు కూడా బాగా తగ్గడంతో అయన కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల ప్రకారమే విభజనకు సహకరిస్తున్నారనే అనుమానాలు బలపడ్డాయి.

 

టీ-బిల్లు శాసనసభకు వచ్చినపుడు ఆయన ఏ ప్రళయం సృష్టించలేదు కానీ, ఆయన బిల్లుని తిరస్కరిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టి చర్చను మూడు రోజుల ముందే ముగించి భద్రంగా డిల్లీకి చేర్చారు. రాష్ట్ర శాసనసభ బిల్లుని తిరస్కరించినంత మాత్రాన్న వచ్చిన నష్టమేమిఉండబోదని దిగ్విజయ్ సింగ్ పదే పదే చేపుతున్నపటికీ, ఆయన బిల్లుని తిరస్కరించడమే ఓ ఘన కార్యంగా చేసిచూపారు.

 

ఆ తరువాత డిల్లీలో దీక్షకు కూర్చొని మళ్ళీ ప్రజలలో కొంత పేరు సంపాదించుకొన్నారు. కనీసం అప్పుడయినా రాజినామా చేసి బయటకు వచ్చిఉంటే ఆయనకు ఎంతో కొంత విలువ ఉండేది. కానీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేక, ఆ తరువాత, అధికారికంగా దృవీకరించుకొన్న తరువాత అంటూ పదవి పట్టుకొని వ్రేలాడుతూ ఉన్న పరువుని కూడా పోగొట్టుకొన్నారు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసి బయటకి వచ్చి వెనక్కి తిరిగి చూసుకొంటే సగం మంది కాంగ్రెస్ లోనే మిగిలిపోగా, మరికొంతమంది ఇతర పార్టీలలోకి వెళ్లిపోవడంతో ఆయన వెనుక అశోక్ బాబు, ఓ గుప్పెడు మంది యం.యల్యేలు, ఒకరిద్దరు యంపీలు తప్ప మారెవరూ కనబడలేదు. ఆయనకు గట్టిగా మద్దతు పలికిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకోగా, గంటా, ఏరాసు, టీజీ వంటి వారు తెదేపాలో తేలారు.

 

ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం, దానిని ప్రజలలోకి తీసుకువెళ్ళడం ఆయన వెనుక ఉన్న గుప్పెడు నేతల వలన అయ్యే పనికాదు. అందుకే ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నారు. చాలా మంది రాజకీయ నేతలు “సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకొంటామని” చెపుతూ ఉంటారు. కిరణ్ సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వలననే ఇప్పుడు ఆయన ఒంటరివారయ్యారు. ఇంతకాలం ఒక వెలుగు వెలిగి పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ ఆడించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు తన భవిష్యత్ ఏమిటో తనకే తెలియని పరిస్థితి ఏర్పడింది.