సొంతింట పట్టులేక.. పొరుగుకు నల్లారి పరుగు
posted on Mar 12, 2014 6:13AM
.jpg)
ఇంట గెలవకనే రచ్చ గెలిచేందుకు పోయినట్టుంది మాజీ సీఎం కిరణ్ వ్యవహారం. ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ బుధవారం పురుడు పోసుకుంటోంది. ఇందుకు గోదావరి తీరం రాజమండ్రి వేదిక కానుంది. రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన సొంత జిల్లాలోని తిరుపతిని కాకుండా అయన రాజమండ్రిని ఎంపిక చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఆయనకు పట్టులేకపోవడమే అని విమర్శకులు అంటున్నారు. మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు జిల్లా కాంగ్రెస్ పార్టీపై గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై గానీ ఎప్పుడూ పట్టులేదు. జిల్లా ప్రజల్లోనూ తనదంటూ ముద్ర వేసుకోవడంలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని స్థాపించడమంటే ఇంట గెలవకనే రచ్చ గెలిచే ప్రయత్నమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తరువాత జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశం ఇచ్చిన జిల్లాను, నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదనే అపవాదును మాజీ సీఎం మూటగట్టుకుంటున్నారు. గత నెల 19వ తేదీన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారు.