Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తుమ్మలకు కలిసివస్తున్న ఎన్నికలు
posted on: May 19, 2016 5:38PM

తెలంగాణ ఆవిర్భావం తరువాత తెదెపా నుంచి తెరాసకు వలస వరుస కట్టిన నేతలలో ముఖ్యులు తుమ్మల నాగేశ్వరరావు. అధికార పార్టీ బలంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు ఇలా గట్టుదాటేయడం కొత్తేమీ కాదు. కానీ ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న తుమ్మల ఆ తరువాత తెరాసలోనూ తన హవాను కొనసాగించడమే ఆశ్చర్యం. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు ఉన్న ప్రాధాన్యత గ్రహించిన తెరాస ఆయనను సాదరంగా ఆహ్వానించడమే కాకుండా, మంత్రిపదవిని కూడా కట్టబెట్టింది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన తుమ్మలకు ఇది అరుదైన గౌరవమే. కానీ ఆయన కూడా తనకు దక్కిన దానితో తృప్తిగా ఉండిపోలేదు.
ఖమ్మంలో ఒకప్పుడు తెదెపాకు ఉన్న క్యాడర్‌ను నిదానంగా తెరాస వైపు మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. ఇంతలో ఖమ్మం నగరపాలిక ఎన్నికల నగారా మోగనే మోగింది. అప్పటికే హైదరాబాదులో గ్రేటర్ ఎన్నికలలో పట్టరాని విజయం సాధించిన తెరాసకు ఖమ్మం ఒక సవాలుగా నిలిచింది. అటు కాంగ్రెస్, ఇటు వామపక్షాల హవా ఉన్న ఖమ్మం ఖిల్లాలో తెరాసను నెగ్గించుకోవడం తుమ్మలకు సవాలుగా మారింది. అందుకే పకడ్బందీగా ఎన్నికల ప్రచారాలను సాగించి, ఓటర్లను ఆకర్షించి ఖమ్మం నగరపాలిక ఎన్నికలలో తెరాసను గెలిపించుకున్నారు. ఆ ఎన్నికలతో తుమ్మల ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. ఆ విజయోత్సాహాలు ముగిశాయో లేదో... పాలేరులో ఉప ఎన్నికలు వచ్చేశాయి. అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెకంటరెడ్డి చనిపోవడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు వచ్చిన ఎన్నికలను తుమ్మల బాగానే ఉపయోగించుకున్నారు. సాధారణంగా ఎవరన్నా ఎమ్మెల్యే చనిపోయినప్పుడు వారికి సానుభూతిగా మిగతా పార్టీలు ఎన్నికలలో పోటీ చేయకుండా తటస్థంగా ఉండిపోతాయి. కానీ తెరాస ఈ అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధపడలేదు. తెరాస తరఫున అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు వరంలా కనిపించింది. ప్రస్తుతం తెరాసకి ఉన్న ఊపుకి, తుమ్మల యంత్రాంగం తోడై పాలేరు తెరాస వశమైంది. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే పాలేరు చరిత్రలోనే తెరాస అద్భుతమైన విజయాన్ని సాధించింది.






