కేజీ బేసీన్లో మన వాటా పొందాల్సిందే



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ నాయకుడు అయితే విభజన బిల్లు  రాజ్యసభలో ఆమోదం పొందిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారో, అదే నాయకుడు ఇప్పుడు ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయం విభజన బిల్లులో లేదు కాబట్టి తామేమీ చేయలేమని కూల్‌గా చెబుతున్నారు. ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనే అలా మాట్లాడుతున్నప్పుడు ఏపీ ప్రజలు, నాయకులు ఇక ఆ విషయం గురించి దేబిరించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ గుప్పిట్లో వున్న అంశాల నుంచి ఎలా ప్రయోజనాలు పొందాలో ఆలోచించాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా మరో అన్యాయం జరిగిందని అనుకుని, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఏపీలోనే వున్న బంగారు బాతు కేజీ బేసిన్ నుంచి ఎలా ఆదాయం పొందాలో ప్రణాళికలు రూపొందించాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసినందుకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్ నుంచి కేంద్రం బోలెడంత సహజవాయువును తరలించుకుని వెళ్తోంది. ప్రతి ఏడాది కేజీ బేసిన్ ద్వారా లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి వాటా ఎంతమాత్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో గతంలో నియమించిన కమిటీలు ఆంధ్రప్రదేశ్‌కి ఆదాయంలో వాటా ఇవ్వాలని చెప్పాయి. ఆయా కమిటీలు ఇచ్చిన రిపోర్టులు ఇంతవరకు ఆమోదాన్ని పొందలేదు. కేంద్ర ప్రభుత్వం వాటిని ఎప్పటి నుంచో పెండింగ్‌లో పెట్టింది. ఆ నివేదికలను ఆమోదించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడా 10 వేల కోట్ల రూపాయల  ఆదాయం లభించే అవకాశం వుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ నివేదికలను ఆమోదించి వెంటనే తమకు కేజీ బేసీన్‌ ఆదాయంలో వాటా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి దీనికి సానుకూల స్పందన రాకపోతే ఏపీ ఏ విధంగా మెలికలు పెట్టాలో ఆ విధంగా మెలికలు పెడితే సరిపోతుంది. ఏ రాష్ట్రం పరిధిలో వున్న వాటిమీద ఆ రాష్ట్రానికే హక్కులు వుంటాయని గౌరవనీయమైన కోర్టులు కూడా సెలవిస్తున్నాయి. మరి ఏపీ పరిధిలో వున్న కేజీ బేసిన్ ఆదాయం మీద ఏపీ హక్కులు పొందకపోతే కేంద్రం దృష్టిలో ఏపీ అంటే చులకన మరింత పెరిగిపోవడం ఖాయం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu