తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి కేసు.. కీలక నిందితుడి అరెస్టు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితుడిని సిట్ అరెస్టు చేసింది.  ఈ కేసులో  ఏ16 గా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ ను  సిట్ అదుపులోనికి తీసుకుంది.

అజయ్ కుమార్ సుగంధ్‌  మోన్‌ గ్లిసరైడ్స్‌, అసిటిక్‌ యాసిడ్‌ ఎస్టర్‌ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లుగా  సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఆ రసాయనాలను పామాయిల్‌ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేశారనీ, ఆ కల్తీ నెయ్యినే లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారనీ తమ దర్యాప్తులో నిర్ధారణ అయ్యిందని సిట్ అధికారులు తెలిపారు.

  లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్‌ ఉన్నట్లుగా గుర్తించినట్లు చెప్పారు. గత ఏడేళ్లు  బోలే బాబా కంపెనీ కి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్‌ కుమార్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఆధారాలను సైతం సేకరించి అజయ్ సుగంధ్ సుకుమార్ ను అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన అజయ్ కుమార్ సుగంధ్ ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచగా కోర్టు అతడికి  ఈ నెల 21 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu