లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు...

 

ఆలూ లేదూ.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెత తెలిసే ఉంటుంది కదా. అలా ఉంది ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం చూస్తుంటే. ఎందుకంటే...ఇంకా సినిమా షూటింగ్ లు పూర్తవ్వలేదు కానీ... అప్పుడే ఒకళ్ల మీద ఒకళ్లు మాటల యుద్దాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా "లక్ష్మీస్ వీరగ్రంధం" సినిమాపై జరుగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఈ బయోపిక్ విషయంలో... లక్ష్మీస్ వీరగ్రంథం చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి..లక్ష్మీపార్వతి మధ్య మాటల యుద్దమే జరుగుతుంది. అంతేకాదు.. ఇటీవల జగదీశ్వర్ రెడ్డి... సినిమా షూటింగ్ ను కూడా ఆపేశారు.

 

ఇక దీనిపై స్పందించిన జగదీశ్వర్ రెడ్డి... ఈ చిత్రాన్ని అడ్డుకోవలని లక్ష్మీపార్వతి ప్రయత్నం చేస్తున్నారని.. ఆ దుష్టశక్తి బారి నుంచి కాపాడమని ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమెలో మార్పు కోరుతూ ఎన్టీఆర్ ఆత్మశాంతి యాత్ర చేపట్టారు. తమను ప్లాట్ ఫాంగాళ్లు అన్న లక్ష్మీ పార్వతి ఏ రాజమహల్ నుంచి వచ్చారో ప్రజలకు చెప్పాలని కేతిరెడ్డి నిలదీశారు. మీ ఊళ్లో చర్చకు సిద్ధమా, అంత శక్తి ఉందా లక్ష్మీపార్వతి పుట్టిన గుంటూరు జిల్లా బచ్చల తాటిపర్రులో బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా, షూటింగ్ పోలీస్ వారు ఆపితే మా నిర్మాత నీకు ఫోన్ చేసి మిమ్మల్ని అర్థించాడని చెబుతున్నావని, షూటింగ్‌ను ఆపే శక్తి నీకు ఉంటే, మీరే వచ్చి ఆపవచ్చు కదా అని నిలదీశారు. కష్టాల కడలిని అనుభవిస్తున్నానని, మూడు ముళ్ల పెళ్లికి ముప్పై ఏళ్ల వైదవ్యం అనుభవిస్తున్నానని మీరు మా నిర్మాతతో చెప్పలేదా అని నిలదీశారు. లక్ష్మీపార్వతి ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారు.. తమతో ఓ రకంగా, మీడియా ముందు మరో రకంగా మాట్లాడుతున్నారని కేతిరెడ్డి ఆమెపై నిప్పులు చెరిగారు. అన్నగారి ధర్మపత్నిని అని చెప్పుకునే మీ భాష దారుణంగా, దిగజారుడుగా ఉందన్నారు. మొత్తానికి సినిమా ఎప్పుడూ పూర్తవుతుందో తెలియదు కానీ.. ఆదిలోనే హంసపాదు అన్నట్టు అప్పుడే అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక ఒక బయోపిక్ విషయంలోనే ఇలా ఉంటే ఇంకా వర్మ తీయబోయే సినిమా.. తేజ తీయబోయే సినిమాకు ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో.. ఎన్ని బయోపిక్ లు బయటకు వస్తాయో చూద్దాం...