Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పీక్స్ కు చేరిన కేశినేని బ్రదర్స్ విభేదాలు.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
posted on: Jun 13, 2026 3:05PM

విజయవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి. మాజీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుత విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని చిన్ని మధ్య నడుస్తున్న రాజకీయ వైరం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన సొంత తమ్ముడైన చిన్నిపై కేశినేని నాని ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
తాజాగా శుక్రవారం (జూన్ 13) కేశినేని చిన్నిపై ఉన్న పలు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నాని ఈడీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా పంపించారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ ఫిర్యాదులో కేశినేని చిన్నిపై నాని అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో చిన్నికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. దీనితో పాటు గత ఎన్నికల సమయంలో విజయవాడ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టిక్కెట్లను ఒక్కొక్కటి రూ. 5 కోట్లకు చిన్ని విక్రయించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రగతి నగర్ ప్రాంతంలో 112 ఎకరాల భూమిని కబ్జా చేసి, ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని నాని లేఖలో స్పష్టం చేశారు.
వీటితో పాటు హైదరాబాద్ కేంద్రంగా సాగిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ప్రీ-లాంచింగ్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా అక్రమ మైనింగ్, ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున అవినీతి సంపాదన కూడబెట్టారని నాని సంచలన అంశాలను ప్రస్తావించారు. ఇంతకాలం జరిగిన అక్రమాలు చాలని, తక్షణమే పీఎంఎల్‌ఏ చట్టం కింద సమగ్ర దర్యాప్తు జరిపి ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు, బెజవాడ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన అన్నాదమ్ములు ఇలా దర్యాప్తు సంస్థల దాకా వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఆరోపణలు, లేఖపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అదలా ఉండగా.. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదు మేరకు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేశినేని చిన్ని ఫిర్యాదు మేరకు.. 2025 ఏప్రిల్ 22న కేశినేని నాని సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో ఎంపీ చిన్ని అక్రమంగా లబ్ధి పొందుతున్నారనీ.. బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ దుష్ప్రచారంపై గతంలోనే తాను లీగల్ నోటీసులు పంపినప్పటికీ, నాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని.. పైగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూనే ఉన్నారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


.webp)



