కేసీఆర్ మొదలెట్టారు.. జగన్ కొనసాగిస్తున్నారు.. ఏబీవీ

posted on: Feb 9, 2026 10:16AM

రాజకీయ నాయకులలో భాషా సంస్కారం తగ్గిపోతోందన్న విమర్శ ఇటీవలి కాలంలో చాలా చాలా గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సభ్య సమాజం ఇసుమంతైనా సహించని పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై దూషణలకు దిగడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇటీవల వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉపయోగించిన అసభ్య పదజాలం, దూషణలు, అలాగే మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా మరో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగు రమేష్  ఉపయోగించిన భాష ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలలో భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, ఇష్టారీతిగా సంస్కారం లేకుండా ప్రత్యర్థులపై దూషణల పర్వానికి దిగడం అన్నది ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఈ రకమై భాష వినియోగానికి శ్రీకారం చుట్టినది బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. కేసీఆర్ ఆరంభించిన ఈ ఆమోదయోగ్యం కాని భాషను ప్రత్యర్థులపై ప్రయోగించే సంస్కృతిని కేసీఆర్ ఆరంబిస్తే.. దానిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కొనసాగించారని ఆయన పేర్కొన్నారు.

బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడారని  గుర్తుచేశారు. అయితే అప్పట్లో ఉద్యమ వేడి కారణంగా కేసీఆర్ భాషను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. అభ్యంతరం ఉన్నా.. తెలంగాణ సెంటిమెంట్ అత్యంత బలంగా ఉండటంతో.. అడ్డు చెప్పి ఎదుర్కోవడానికి వెనుకాడారని పేర్కొన్నారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదప్రయోగాలు మాత్రం కేసీఆర్ హయాంలోనే మొదలైందన్న ఆయన ఈ ధోరణి రాజకీయ నాయకులలో ప్రబలడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదన్నారు.  

కేసీఆర్‌ను తమ గురువుగా భావించే జగన్.. ఏపీ రాజకీయాలలోకి కూడా భాషా సంస్కారానికి తిలోదకాలిచ్చి, అసభ్య పదజాలంతో ప్రత్యర్థులను దూషించడం మొదలెట్టి కొనసాగిస్తున్నారని విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన సాగిన ఆ ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు సైతం దారుణమైన బూతులతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడ్డారన్నారు. దీని వల్ల ఏపీ రాజకీయ సంస్కృతి దారుణంగా దెబ్బతిందన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ కూడా  సమస్యలను చర్చల ద్వారా కాకుండా..  ప్రత్యర్థులను అణచివేస్తూ, తొక్కుకుంటూ ముందుకు సాగాలనే తత్వం వారిద్దరిలోనూ కనిపిస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే బూతులు మాట్లాడటం  యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఏబీవీ అభిప్రాపడ్డారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...