Latest News
సిట్ విచారణ... ఫాంహౌస్ నుండి బయలుదేరిన కేసీఆర్
posted on: Feb 1, 2026 11:03AM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుండి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి బయలుదేరారు. ఉదయం ఫాంహౌస్ వద్దకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకోగా వారికి అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు సాగారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని నివాసంలో సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించనున్నారు. గులాబీ బాస్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నందినగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. మాజీ సీఎం నివాసంలోకి కుటుంబసభ్యులు, సిట్ అధికారులను మాత్రమే అనుమతించనున్నారు. పార్టీ శ్రేణులు, అనుచరులు ఇంట్లోకి రాకుండా ఆంక్షలు విధించారు. కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమిషనర్లు, ఎస్పీలకు ఇంటెలిజెన్స్ చీఫ్ అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు ఎక్కడిక్కడ అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద పరిస్థితులపై తక్షణం స్పందించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు.






