అడ్డెడ్డే.. ఇంతలోనే జ్వరమా?

 

సాధారణంగా కొంతమందికి గుండె గుభేల్‌మంటే, హఠాత్తుగా ఉలిక్కిపడేతే జ్వరం వచ్చేస్తూ వుంటుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిందంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గుండె గుభేల్‌మని, ఆయన హఠాత్తుగా ఉలిక్కిపడినట్టున్నాడు. అందుకే ఆయనకు జ్వరం వచ్చేసింది. రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిందన్న వార్త బయటకి వచ్చిన కాసేపటికే కేసీఆర్‌కి జ్వరం వచ్చిందన్న వార్త వచ్చింది. దీన్నిబట్టి కేసీఆర్‌కి జ్వరం రావడానికి రేవంత్ రెడ్డికి బెయిల్ రావడమేనని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అయినా కేసీఆర్ లాంటి ఘటికుడు ఈమాత్రం దానికే జ్వరం తెచ్చుకోవడమేంటో. ఇంత చిన్న విషయానికే జ్వరం తెచ్చుకుంటే, భవిష్యత్తులో ఎదురయ్యే అనేక విషయాలను ఎలా తట్టుకుంటారో ఏంటో. రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసినప్పుడు ఆయన మీసం మెలిపెడుతూ చేసిన ప్రతిజ్ఞ కేసీఆర్‌కి గుర్తుండే వుంటుంది. మరి ఇప్పుడు బెయిల్ లభించిన రేవంత్ రెడ్డి తనకు జరిగిన దానికి అంతకు అంత ప్రతీకారం తీర్చుకోకుండా వుంటారా? మామూలుగానే రేవంత్ రెడ్డి అంటే అధికార పక్షానికి గుండెలో గుబులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బతిన్న పులి. ఆయన భవిష్యత్తులో ఎలా స్పందించబోతున్నారో... ఏమేం చేయబోతున్నారో.. మరి ఆ పరిణామాలన్నిటికీ కేసీఆర్‌ జ్వరం ఇంకా ఎన్ని డిగ్రీలు పెరిగిపోతుందో!