వరల్డ్ బ్యాంక్ తెలంగాణ ద్రోహ? చంద్రబాబు-వెంకయ్య మేనేజ్ చేశారా?
posted on Sep 16, 2015 4:34PM

ప్రపంచ బ్యాంక్ నివేదికపై తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. పెట్టుబడులకు, వ్యాపారాలకు అనుకూల రాష్ట్రాల్లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో తెలంగాణకు 13వ ర్యాంక్ రావడంపై కేసీఆర్ అండ్ కో ఆశ్చర్యం వ్యక్తంచేస్తుండగా, రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు పనితీరుకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికే కొలమానమని, పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని టీడీపీ నేతలు గొప్పులు చెప్పుకుంటుంటే, అదంతా కుట్ర, చంద్రబాబు-వెంకయ్య కలిసి మేనేజ్ చేశారంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు.
అయితే వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంత-ప్తిని వ్యక్తంచేసింది. వ్యాపారాలకు, పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక సదుపాయాలున్న తెలంగాణను దారుణంగా వెనక్కి నెట్టారని, అసలు ఏ పద్ధతి ప్రకారం ప్రపంచ బ్యాంక్ ర్యాంకులు ప్రకటించిందో తెలియడం లేదంటున్నారు. అయినా ఈ ర్యాంకులతో దిగులు చెందాల్సిన పనిలేదని సర్దిచెప్పుకుంటూనే, తమ పనితీరుకు తెలంగాణలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివద్ధే నిదర్శనమంటూ పలువురు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు.
పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలంగాణకు నెగటివ్ గా ఉండటంతో ఆత్మరక్షణలో పడ్డ గులాబీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు.ఇదంతా చంద్రబాబు కుట్ర అని, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రపంచ బ్యాంక్ ను మేనేజ్ చేశారని, అందుకే తెలంగాణకు 13వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ కి 2వ ర్యాంక్ ఇచ్చారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టారు.పైగా వరల్డ్ బ్యాంక్ ర్యాంకింగ్స్ కు అసలు క్రెడిబులిటీయే లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అసలు ఎలాంటి మౌలిక వసతుల్లేని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఎలా స్వర్గధామం అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలోనే తాము అద్భుతమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామని, టీఎస్-పాస్ తో ఇప్పటికే అనేక కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చామని గుర్తుచేస్తున్నారు.
ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదని, ఈ నివేదికతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్న గులాబీ నేతలు...డామేజ్ కంట్రోల్ కి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినా ప్రపంచ బ్యాంక్ నివేదికను తప్పుబట్టడం సరికాదని, అంతర్జాతీయ సంస్థను మేనేజ్ చేసేతంట స్థాయి చంద్రబాబుకి, వెంకయ్యకు ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ ను కూడా తెలంగాణ ద్రోహి అనడంలో అర్థంలేదని, ఇలాంటి ఆరోపణలతో తెలంగాణకు మరింత డామేజ్ జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు
అయితే టీఆర్ఎస్ నేతల బాధ...తెలంగాణకు 13వ ర్యాంక్ వచ్చిందని కాదంటా? పక్క రాష్ట్రం...తమ రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు అధికారంలో ఉన్న ఏపీకి సెకండ్ ప్లేస్ వచ్చిందని తట్టుకోలేకపోతున్నారట. అందుకే ఇది చంద్రబాబు-వెంకయ్య కుట్ర అంటూ బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని గులాబీ నేతలను ఎత్తిపొడుస్తున్నారు టీటీడీపీ నేతలు