విభజన.. కేసీఆర్ భజన!

 

kcr bhajana, Telangana, ap byfurication, Samaikyandhra,telangana bill, seemandhra,congress

 

 

తిలాపాపం తలా పిడికెడన్నట్టు రాష్ట్ర విభజన పాపాన్ని అన్ని పార్టీలకూ తలా పిడికెడు పంచితే తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రం నాలుగైదు పిడికిళ్ళు పంచాలి. ఇదిలా వుంటే, రాష్ట్రంలో ఒకపక్క విభజన పర్వం నడుస్తుంటే మరోపక్క టీఆర్ఎస్‌లో కేసీఆర్ భజనపర్వం నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని నాయకులుగా తెరమీదకు వచ్చిన ఛోటామోటా లీడర్లందరూ కేసీఆర్‌ భజన చేయడంలో నిమగ్నం అయి వున్నారు.

 

టీఆర్ఎస్‌లో జై తెలంగాణ అన్న ప్రతి ఒక్కరు రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేనో, ఎంపీనో అయిపోవాలని కలలు కంటున్నారు. వాళ్ళలో ఎంతటి పచ్చి అబద్ధాన్నయినా నిజమని పెద్ద గొంతుతో వాదించగల శ్రవణ్ ఒకరు. పార్టీ నాయకత్వమే తన టాలెంట్‌ని గుర్తించి తనను ఏదైనా సీట్లో నిలబెట్టే ఆఫర్ ఇస్తుందేమోనని ఆయన ఎదురుచూశారు. చూసీ చూసీ కళ్ళు కాయలు కాసినయ్యే తప్ప అటుపక్క నుంచి ఎలాంటి సిగ్నల్ లేకపోవడంతో తానే కేసీఆర్‌ని పొగడటం ద్వారా తాను అనుకున్నది సాధించుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. అందుకే కేసీఆర్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడుతున్నారు. శ్రవణ్ మాటల ప్రకారం కేసీఆర్ తెలంగాణకి జాతిపిత అట. దేశ స్వాతంత్ర్య పోరాటానికి గాంధీజీ ఎలాంటివాడో తెలంగాణ స్వాతంత్ర్య పోరాటానికి కేసీఆర్ అంతటి నాయకుడట.



కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే 1969లో ఉద్యమం నడిపినవాళ్ళు, ఇప్పుడూ అప్పుడూ ఉద్యమంలో అమరులైనవాళ్ళు ఏమైపోయినట్టో! ఈ సందేహం వచ్చింది ఏ సీమాంధ్రుడికో, టీఆరెస్సేతర తెలంగాణవాదికో కాదు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లోనే వున్న కేశవరావుకి.  తెలంగాణ టాపిక్ మీద జరిగిన ఓ మీటింగ్‌లో పాల్గొన్న కేకే.. శ్రవణ్ మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కథానాయకుడెవరూ లేరని..తెలంగాణ వస్తుందంటే దానికి కారణం అమరవీరుల త్యాగమేనని నొక్కి వక్కాణించారు. పనిలోపనిగా కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు కూడా శ్రవణ్ కామెంట్ల మీద సెటర్లు విసిరారు. తెలంగాణ బండికి కేసీఆర్ డ్రైవర్ కావొచ్చేమోగానీ ఓనర్ కాదని అనేశారు. అందర్నీ తిట్టడమే తప్ప పొగడ్డంలో ప్రాక్టీసు లేనిశ్రవణ్ పొగడక పొగడక పొగిడితే ఆ పొగడ్తకి పొగబెట్టేవాళ్ళు బయల్దేరారు.