సీఎంగా ప్రమాణస్వీకారోత్సవం: ఇదేనా కేసీఆర్ మర్యాద?
posted on: Jun 1, 2014 3:03PM
.jpg)
సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతోంది. కొత్త రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సోమవారం నాడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారోత్సవం పాయింట్ దగ్గరి నుంచే కేసీఆర్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కలుపుకుని వెళ్ళాల్సిన కేసీఆర్ ఇప్పటికీ తన పాత పద్ధతిలోనే నియంతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీని పిలవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద వుంది. మోడీ వచ్చినా, రాకపోయినా పిలవాల్సిన అవసరం మాత్రం కేసీఆర్‌కి వుంది. అయితే మోడీని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించే విషయాన్ని కేసీఆర్ ఎంతమాత్రం పట్టించుకోలేదు. మీడియావాళ్ళు అడిగితే మాత్రం ఏవేవో డొంకతిరుగుతు సమాధానాలు చెప్పారు. సరే, మోడీని పిలవకపోతే పిలవకపోయె.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో అడ్డంగా ఆరిపోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనైనా పిలవాలి కదా అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆవేదనగా అంటున్నారు. తెలంగాణ ఇవ్వడం వల్ల అనేకరకాలుగా నష్టపోయిన సోనియాగాంధీని ఇప్పుడు కేసీఆర్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పిలవకపోవడం అవమానకరంగా టీ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఇక ఇలా వుంటే సీమాంధ్రలో అధికారాన్ని సాధించడంతోపాటు తెలంగాణలో గౌరవప్రదమైన స్థానాలు సాధించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా సరైన రీతిలో ఆహ్వానం అందలేదు. ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యాలయం రిసెప్షన్‌లో తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల పేరు మీద కొన్ని ఆహ్వాన పత్రాలు ఇచ్చి వెళ్ళారట. ఇది తెలుగుదేశం నాయకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కేసీఆర్ కాకపోయినా కనీసం టీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా తమకు ఫోన్ చేసి ఆహ్వానించినా మర్యదాగా వుండేదని, ఇలా రిసెప్షన్‌లో ఆహ్వాన పత్రాలు ఇవ్వడం దారుణంగా వుందని వారు అంటున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించే విషయంలో కేసీఆర్ వ్యవహారశైలిని కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా విమర్శిస్తున్నారు. అన్నం మెతుకు పట్టుకుంటే అన్నమంతా ఉడికిందో లేదో తెలుస్తుందన్నట్టుగా, భవిష్యత్తులో కేసీఆర్ ఎంత నియంతృత్వంగా వ్యవహించబోతున్నారన్నదానికి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఒక ఉదాహరణగా నిలిచిందని వారు అంటున్నారు.



.jpg)
.jpg)

.webp)



