Latest News

చంద్రబాబు స్నేహహస్తం కేసీఆర్ అందుకొంటారా?

posted on: May 31, 2014 1:13PM

 

తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా అభివృద్ధి ఫలాలు ఇరువురికీ సమానంగా దక్కాలి. అందుకోసం తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ ఆంధ్రప్రజల పట్ల తన విద్వేషవైఖరిని విడనాడటం చాలా అవసరం. చంద్రబాబు నేటికీ ఆయనకు స్నేహ హస్తం అందిస్తునే ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనపై కత్తులు దూస్తున్నారు. నిజానికి కేసీఆర్ ను మంచి చేసుకోవలసిన అవసరం చంద్రబాబుకు లేదిప్పుడు. కానీ, రాష్ట్ర విభజన కారణంగా ఉత్పన్నమవుతున్న అనేక సమస్యలను, ఏ రాష్ట్రానికి నష్టం జరగకుండా పరిష్కరించుకోవాలంటే, ఇరుగుపొరుగు రాష్ట్రాల మధ్య మంచి సఖ్యత చాలా అవసరం గనుకనే చంద్రబాబు కేసీఆర్ కి స్నేహహస్తం అందిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం చంద్రబాబును అకారణంగా ద్వేషిస్తున్నారు. పోలవరం విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కూడా కయ్యానికి కాలుదువ్వుతున్నారు.

 

కేసీఆర్ తెలంగాణాను బంగారి తెలంగాణాగా మార్చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ కేవలం మాటలతోనే అది సాకారం కాదు. అందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవలసి ఉంది. తెరాసకు బీజేపీతో ఎటువంటి మిత్రత్వం లేకపోయినా, ఇప్పుడు కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి వల్ల శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, కేంద్రం రాష్ట్రానికి తగినన్ని నిధులు విదిలించలేదు. అటువంటప్పుడు తెరాస మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకొనే ప్రయత్నం చెయవలసి ఉంది. ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంబంధాలు కల చంద్రబాబుతో సక్యత కోసం కేసీఆరే ముందుగా ప్రయత్నించి ఉండాల్సింది. కానీ ఆయన భేషజాలకు పోయి స్నేహహస్తం అందిస్తున్న చంద్రబాబుతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి పదవి చెప్పట్టక మునుపే కేంద్రంపై యుద్ధం ప్రకటించారు.

 

కేసీఆర్ ఇదే వైఖరిని ఇకముందు కూడా కొనసాగిస్తే, దానివలన ఆయన అహం చల్లార వచ్చునేమో కానీ తెలంగాణా ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. నేటికీ తను కేసీఆర్ తో సఖ్యతనే కోరుకొంటున్నానని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని, తెలంగాణాను కూడా అభివృద్ధి చేసేందుకు తనవంతు సహాకారం అందిస్తానని చంద్రబాబు పదేపదే చెపుతున్నారు. అందువల్ల కేసీఆర్ ఇప్పటికయినా తన బేషజాలను పక్కనపెట్టి, చంద్రబాబు స్నేహహస్తం అందుకొనేందుకు ముందుకు రావాలి. తెలంగాణా అభివృద్ధి కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు చేతులు కలిపి పనిచేస్తే అందరూ హర్షిస్తారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...