Latest News
కావూరి ఇక లేరు
posted on: Mar 11, 2026 12:13PM
.webp)
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు.. కావూరి సాంబశివరావు 82 ఏళ్ల వయసులో.. 2026 మార్చి 9న కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొన్నాళ్లుగా.. ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడ్డారు. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్టు అయ్యింది.
కావూరి.. కృష్ణాజిల్లా, దోసపాడు గ్రామంలో.. 1943, అక్టోబర్ 1న జన్మించారు. ఆనాటి వరంగల్ ఆర్ఈసీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో పట్టా పొందారు. ఒక ఇంజినీరింగ్ మేథావిగా ఆయన ఎంతో గుర్తింపు సాధించారు.రాజకీయాల్లోకి రాక ముందే ఆయనొక ఇండస్ట్రియలిస్ట్. ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ సంస్థను స్థాపించి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, నేషనల్ హైవేల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
ఐదు సార్లు ఎంపీగా గెలిచిన కావూరి మొత్తం.. మూడు దశకాల పాటు పార్లమెంటులో తన గళం వినిపించారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నుంచి.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి వరుసగా ఎంపీగా గెలిచారు.
యూపీఏ-2లో కేంద్ర జౌళీ మంత్రిగా పని చేశారు. ఆయన మంత్రిగా పని చేసింది కేవలం 2013-14 మధ్య కొంత కాలమే అయినా.. తనదైన ముద్ర వేశారు. కావూరి సాంబశివరావు సమైక్రాంధ్ర కోసం గళం వినిపించిన నేతగా పేరుంది. విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన తన మంత్రి పదవికి , కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య కారణాల వల్ల.. రాజకీయంగా క్రియాశీలకంగా లేరు.
ఆయన సంస్థ ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్ ఒక సమయంలో ప్రపంచ బ్యాంకు ఆంక్షలను ఎదుర్కుంది. దీంతో కొన్ని వివాదాలు ఆయన్ను చుట్టుముట్టాయి.ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆయన భార్య హేమలత. ఈ ఇరువురి దంపతులకు.. ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం విశాఖ ఎంపీ, బాలకృష్ణ చిన్న అల్లుడు.. శ్రీభరత్ మరెవరో కాదు.. సాంబశివరావుకు మనవడు అవుతారు. కావూరి కుమార్తె కుమారుడే శ్రీభరత్. అలా నందమూరి కుటుంబానికి, గీతం కుటుంబంతో కూడా బంధుత్వం ఉంది కావూరి సాంబశివరావుకు.
కావూరి కేవలంఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక గొప్ప ఇంజినీర్. ఇండస్ట్రియలిస్ట్. పార్లమెంటరీ కమిటీల్లో ఆయన సలహా సూచనలు.. ఎంతో పని చేసేవి. మౌలిక సదుపాయాల రంగంలో ఆయనకున్న పట్టు.. దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.



.webp)


