Latest News

తండ్రిలా ఏప్రిల్‌లో..క‌విత పార్టీ స్థాప‌న ఎందుకు...కార‌ణాలేంటి?

posted on: Mar 27, 2026 9:00PM

 

క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి  సెంటిమెంట్లు బాగా  ఎక్కువ‌. ఎందుకంటే  ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి  సెంటిమెంట్ల  ద్వారా. అలా త‌న తండ్రి  తెలంగాణ  రాష్ట్ర స‌మితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించ‌గా.. కూతురు క‌విత, పాతికేళ్ల త‌ర్వాత‌.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సుముహుర్తం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.ఇంత‌కీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ  జాగృతి అనే సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికే ప్ర‌జా అనే ప‌దం  చేర్చుతూ దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.
 
ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో ప‌రిశీలిస్తే.. ధ‌ర్మ గంటను ఖ‌రారు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జెండా, అజెండా  ఎలాంటివో గ‌మ‌నిస్తే ఇప్ప‌టికే జాగ్ర‌త్తికంటూ తెలుపు, లేత ప‌చ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ  ఫ‌స్ట్.. ఆమె తీసుకున్న రాజ‌కీయ విధానంగా స‌మాచారం.  ఇక యువ‌త‌, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కులు, మ‌రీ ముఖ్యంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బీసీ  సంగ‌తి స‌రే స‌రి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటిక‌ల్ లైన్ల‌లో భాగ‌మే. 

వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి డీలిమిటేష‌న్లో భాగంగా తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలు సైతం పెర‌గ‌నుండ‌టంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎంద‌రో కొత్త రాజ‌కీయ నాయ‌కులు పుట్టుకొచ్చేలా  తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం  ఖ‌రారు చేయ‌డం వెనక ఉన్న ఉద్దేశ‌మేంటో ప‌రిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర ప‌ర‌మైన అంశాలు ఇందులో దాగి  ఉన్నట్టు స‌మాచారం. ఏప్రిల్ ఇర‌వై ఐదున రాజ‌యోగాన్నిచ్చే గ్ర‌హ‌గ‌తుల సంచారం  క‌నిపిస్తోందని అంటారు పండితులు. కొత్త  ప‌నులు ప్రారంభించ‌డానికి  ఇది సుదినంగా  చెబుతున్నారు. 

దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధ‌ముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రారంభించారు క‌విత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్ర‌జా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ త‌న‌య‌ క‌విత‌. ఆ పార్టీ  ఆనాడు ఎంతగా ఎదిగిందో, త‌న పార్టీ  కూడా అంతేలా  ఎదుగుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు క‌విత‌. ఉగాది త‌ర్వాత వ‌చ్చే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల అనంత‌రం త‌న పార్టీ  జెండా ఎగుర‌వేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌వ‌చ్చ‌న్న  న‌మ్మ‌కాలు కూడా క‌విత‌కు ఉన్న‌ట్టు స‌మాచారం. 

బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రిగింది. అలాంటి వారికి త‌మ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని అంటున్నారు క‌విత‌. ఇక చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా సాధికార‌త‌ను తీసుకొచ్చేలా 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు కూడా ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌త్యేకించీ యువ‌త కోసం ఉద్యోగ నోటిఫికేష‌న్లు.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం కూడా క‌విత త‌న విధానంగా  చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత  పార్టీ ఎఫెక్ట్ ఎంత‌?  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే  ఎదిగే అవ‌కాశం ఎంత‌? ద‌క్షిణాది నుంచి జ‌య త‌ర్వాత ఆ స్థాయిలో ఒక మ‌హిళ‌గా ఆమె రాజ‌కీయంగా ఎదిగి సీఎం కాగ‌ల‌రా?  తేలాల్సి ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...