Latest News

కవిత కొత్త పార్టీ పేరు ఇదే!

posted on: Mar 19, 2026 12:33PM

 

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత డిసెంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈసీఐ కోర్టుకు తెలిపింది.ఇవాళ జరగనున్న తదుపరి విచారణలో పార్టీ రిజిస్ట్రేషన్ అంశంపై స్పష్టత రానుంది.

బీఆర్ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కూడా తెలిపారు. అయితే ఆ దిశగా కసరత్తు జరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం.ప్రస్తుతం ‘జాగృతి’ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతున్నా, అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపై నిలిచింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి అధికారిక ప్రకటన వెలువడితే, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశముంది.

ఇదిలా ఉంటే, కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదం ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని ముందుకెళ్లే వ్యూహం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ఉన్న పార్టీ, తర్వాత భారత రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్‌కు అనుబంధం తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరులో ‘తెలంగాణ’కు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండటంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కొత్త పార్టీపై ఆసక్తి మరింత పెరుగుతోంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...