Latest News
మూసీ అభివృద్ధి అంతా మోసం...రంగనాథ్‌పై కవిత ఫైర్
posted on: Mar 15, 2026 3:00PM
.webp)
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే అవి తొలగించక పోతే డిఫమేషన్ కేసు వేస్తానని కవిత హెచ్చరించారు.
కవిత మాట్లాడుతూ గతంలో ఆదిత్య కన్స్ట్రక్షన్ సంస్థ మూసీ నది పరిసరాల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతోందని హైడ్రా అధికారులు స్వయంగా లేఖ రాసినట్లు తెలిపారు. అదే అంశంపై తాము ధర్నా చేస్తే ఇప్పుడు తమపై తప్పుదారి పట్టించే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. “మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫ్రూఫ్ లేకుండా నేను ఎప్పుడూ మాట్లాడను. ఈరోజు సాయంత్రం వరకు హైడ్రా చేసిన ట్వీట్లు తొలగించకపోతే రంగనాథ్‌ను కోర్టుకు లాగుతాను” అని ఆమె స్పష్టం చేశారు.
మూసీ నది మధ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయని తాము నిరసన వ్యక్తం చేసిన తర్వాతే హైడ్రా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో వాయిస్ ఓవర్‌తో వీడియోలు పోస్టు చేశారని కవిత ఆరోపించారు. అయితే ఇదే నిర్మాణం విషయంలో 0.37 ఎకరాల ఆక్రమణ జరిగిందని, 23 మీటర్లు ఎన్‌క్రోచ్ అయ్యిందని హైడ్రా కమిషనర్ గతంలో ఒప్పుకున్నారని చెప్పారు.“పేదవాళ్ల ఇళ్లు కూల్చడంలో మాత్రం హైడ్రా చురుకుగా ఉంది. కానీ పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోంది” అని కవిత విమర్శించారు.
నాలాలను మళ్లించకుండా నిర్మాణాలు చేయడంతో కోకాపేట, నార్సింగ్ ప్రాంతాల్లో వరదలు వచ్చాయని కూడా ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాను ప్రజలపై వదిలిన మహమ్మారిగా మార్చిందని ఆమె ఆరోపించారు. “పేదల ఇళ్లను కూల్చుతూ పెద్దవాళ్లను కాపాడుతున్నారు. అందరికీ ఒకే రూల్ ఉండాలి. మూసీ నది మధ్యలో ఉన్న ఆ అక్రమ నిర్మాణాన్ని తప్పనిసరిగా కూల్చాలి” అని డిమాండ్ చేశారు.
మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా ముందుకెళ్తోందని కవిత అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్‌కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే జాగృతి హెచ్చరించిందన్నారు. ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తిగా సిద్ధం కాలేదని, ఖర్చు అంచనాలు ఆరు నెలల్లోనే దాదాపు రూ.1400 కోట్లు పెరిగాయని ఆమె ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చి భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని కవిత ఆరోపించారు. ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోతున్న వేలాది బాధితులను చర్చలకు పిలవకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు అధికారులతో మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితుల సమస్యపై ఈ నెల 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు జాగృతి పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.


.webp)



