కాశీబుగ్గ తొక్కిసలాట..ఆలయ నిర్వాహకుల వైఫల్యమే కారణం
posted on Nov 1, 2025 2:16PM

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రెయిలింగ్ కూలిపోవడంతోనే ప్రమాదం జరిగింది. కాగా కేవలం ఐదువేల మంది మాత్రమే కెపాసిటీ ఉన్న ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి సందర్భంగా పాతిక వేలకు మందికి పైగా భక్తులు తరలిరావడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. ఇలా ఉండగా ఈ ఆలయ నిర్వహణ ప్రభుత్వ అధీనంలో లేదని ఏపీ దేవాదాయ శాఖ తెలిపింది. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినదని పేర్కొంది. ఏడాది కిందట ఈ ఆలయ నిర్మాణం జరిగిందనీ, ఈ ఆలయాన్ని పది కోట్ల రూపాయల వ్యయంతో ఐదెకరాల స్థలంలో పండా అనే భక్తుడు నిర్మించినట్లు చెబుతున్నారు.
ఈ ఆలయం ప్రారంభమైన తరువాత ఇదే తొలి కార్తీక మాసం కావడం గమనార్హం. . కాగా ఆలయానికి భక్తులు భారీగా వస్తారన్న సమాచారం ఆలయ నిర్వాహకులు ప్రభుత్వానికి ఇవ్వలేదని తెలిసింది. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా సంఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారును ఆదేశించారు.
కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా పది మంది మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్ వారికి ప్రభుత్వం అండగా ఉంటుం దన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.