ఏపీ ప్రభుత్వానికి సెల్యూట్
posted on: Sep 13, 2014 12:09PM
.jpg)
బెదిరించి సెల్యూట్స్ చేయించుకోవాలని అనుకోవడం గొప్ప విషయం కాదు. నలుగురికీ ఉపయోగపడే పనులు చేసిన ఎవరికైనా అడక్కుండానే సెల్యూట్ చేస్తారు. ఇప్పుడు అలా సెల్యూట్స్ అందుకునే పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. ఆపదలో వున్న తెలుగువారిని ఆదుకునే విషయంలో ఎలాంటి వివక్ష చూపించకుండా ఆదర్శప్రాయంగా నిలిచింది.
ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ రాష్ట్రం భారీ వరదల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రం చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో సంభవించిన వరదల్లో ఇప్పటి వరకు మృతుల సంఖ్య రెండు వందలు దాటింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీ సంఖ్యలో సైన్యం రంగప్రవేశం చేస్తే తప్ప పరిస్థితి కొంతవరకైనా అదుపులోకి రాలేదు. వరదల ధాటికి అసలు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఉనికే మాయమైపోయింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఆయన కార్యాలయం కూడా వరదల్లో చిక్కుకుపోయింది. కనీసం ఫోన్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
ఇంత దారుణమైన వరదల్లో 36 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న 36 మంది తెలుగు విద్యార్థులు వరద పరిస్థితిని చూసి బెంబేలెత్తిపోయారు. వీరిలో 19 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కాగా, 17 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు. తెలుగు విద్యార్థులు కాశ్మీర్‌లో చిక్కుకున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం స్పందించింది. తెలుగు విద్యార్థులను రక్షించి వారిని స్వస్థలాలకు పంపించే బాధ్యతను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి గద్దే రామ్మోహన్ రావుకు అందించింది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించి 36 మంది విద్యార్థులను విమానంలో క్షేమంగా హైదరాబాద్‌కి చేర్చారు. మేము ఆంధ్రప్రదేశ్‌కి చెందని వాళ్ళం కాబట్టి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల బాధ్యతను మాత్రమే తీసుకుంటామని అనకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను కూడా సురక్షితంగా హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ తమ విషయంలో చూపించిన ఆదరణకి తెలంగాణ విద్యార్థులు ఎంతో సంతోషించారు. తమను పరాయివారిగా చూడనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.



.jpg)
.jpg)

.webp)



