కాశీబుగ్గ ఆలయం ప్రభుత్వానికి చెందినది కాదు : మంత్రి ఆనం

 

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని, అది ఒక ప్రైవేట్ దేవాలయమని కీలక విషయాలు వెల్లడించారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయాన్ని హరిముకుంద్‌పండా అనే వ్యక్తి తన సొంత నిధులతో, తనకు చెందిన 12 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రభుత్వ నిర్వహణలో కానీ, దేవాదాయ శాఖ ఆధీనంలో కానీ లేదు. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యవహారం" అని వివరించారు. ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు రావడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు. 

ఆలయ సామర్థ్యం కేవలం 2,000 నుంచి 3,000 మంది మాత్రమే. కానీ, శనివారం ఏకాదశి కావడంతో ఒక్కసారిగా దాదాపు 25,000 మంది భక్తులు తరలివచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పుడు నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. కనీసం ప్రభుత్వానికి లేదా పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు దారితీసింది" అని మంత్రి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. మంత్రులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన వివరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu