కర్ణాటకలో మరో పోలీస్ అధికారిణి ఆత్మహత్యాయత్నం..

posted on: Jul 22, 2016 2:43PM

కర్ణాటకలో పోలీసు అధికారుల బలవన్మరణాలు ఆగడం లేదు. కొద్ది రోజుల క్రితం మంగుళూరులో డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఏంకే గణపతి మడికెరలో ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగడం..చివరకు మంత్రి కేజే జార్జ్ రాజీనామా చేయడం వరకు వెళ్లింది. తాజాగా మరో పోలీస్ అధికారిణి ఆత్మహత్యకు ప్రయత్నించింది. హాసన్ అసిస్టెంట్ కమిషనర్ విజయా తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసింది.

 

తాను సూసైడ్ చేసుకోబోతున్నట్టు తన పై అధికారి శోభారాణికి ఫోన్‌చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడికి వెళ్లిన శోభారాణి ఇరుగుపొరుగు వారి సాయంతో విజయను కాపాడి హాసన్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలిసింది. ఈమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రజా సంఘాలు ధర్నాలు చేపట్టాయి. దీనిపై విజయ బెంగుళూరులోని కేఏటీలో విచారణకు హాజరయ్యారు.

 

విచారణలో లాయర్ దేవరాజ్‌గౌడ విజయపై పలు అభియోగాలు మోపడంతో పాటు కేఏటీకి తప్పుడు సమాచారం అందించారని ఆరోపించడంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ప్రభుత్వాధికారులు సూసైడ్‌లకు పాల్పడుతున్న తరుణంలో విజయ ఆత్మహత్యాయత్నం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...