అత్యాచారాన్ని అడ్డుకున్న కూతురు..హత్య చేసిన తండ్రి

posted on: Jul 4, 2016 3:53PM

సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి. తనను చెరపట్టాలని చూసిన కన్నతండ్రిని ప్రతిఘటించడమే ఆమె చేసిన నేరమైపోయింది. అంతే కూతురని కూడా చూడకుండా చంపేశాడు. కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలంలో ఆదృశ్యమై, శవంగా మారిన నవవధువు మౌనిక కథలో వెలుగు చూసిన వాస్తవం ఇది. మేడిపల్లి మండలంలోని దేశాయిపేటకు చెందిన మౌనికకు మోత్కురావుపేటకు చెందిన యువకుడితో మూడు నెలల కిందట వివాహం అయ్యింది. ఆషాడమాసం కావడంతో మౌనికను దేశాయిపేటకు తీసుకువచ్చేందుకు తండ్రి భూమళ్ల మల్లయ్య శనివారం రాత్రి మోత్కురావుపేటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 7.30 ప్రాంతంలో తండ్రి కూతురు బైక్‌పై దేశాయిపేటకు తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో గోవిందరాం గ్రామ సమీపంలో బైక్ ఆపి మౌనికపై అత్యాచారం చేయబోయాడు. దీనిని కూతురు ప్రతిఘటించడంతో ఆమెను చీర కొంగుతో ఉరేసి చంపాడు.

 

కూతురిని హత్య చేసిన మల్లయ్య తప్పించుకోవడానికి పెద్ద నాటకం ఆడాడు. గోవిందరాం గ్రామ సమీపంలో మాస్క్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై వచ్చి తన ముఖంపై మత్తు జల్లి చేతులు కట్టేసి మౌనికను కిడ్నాప్ చేశారని గ్రామస్తులకు చెప్పుకొచ్చాడు. వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఏమి ఏరగనట్టు పోలీసుల వెంటే ఘటనాస్థలికి వెళ్లాడు. ఈ క్రమంలో మౌనిక కోసం గాలిస్తున్న గ్రామస్తులకు గోవిందరాం గ్రామంలోని పొదల్లో మౌనిక మృతదేహం లభ్యమైంది.

 

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు మాస్క్‌లు ధరించినట్లైతే వారు తెలిసిన వారై ఉండాలి. ఒక వేళ దొంగలే ఈ దారుణానికి పాల్పడితే మౌనిక ధరించిన బంగారు ఆభరణాలను అపహరించి ఉండాలి. కానీ ఆమె ఒంటిమీద బంగారునగలు అలాగే ఉన్నాయి. అత్యాచారం చేసిన దాఖలాలు లేవు. దానికి తోడు దుండగులు కిడ్నాప్ చేశారని చెబుతున్న ప్రాంతానికి మృతదేహం లభించిన ప్రాంతానికి మధ్య దూరం కిలోమీటరు కూడా లేకపోవడం అనుమానాలను కలిగించింది. మృతురాలి తండ్రి చెబుతున్న కథనానికి, వాస్తవానికి పొంతన లేకపోవడంతో పోలీసుల దృష్టి మల్లయ్యపై పడింది. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా తానే మౌనికను హత్య చేసినట్లు వెల్లడించాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...