మోడీ డైరెక్షన్ లో గౌతమి కమల్ కు చెక్....
posted on Mar 1, 2018 10:24AM

కమల్ హాసన్ ను ఇరుకున పెట్టడానికి మోడీ గౌతమి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతంర తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే అదనుగా బీజేపీ అక్కడ కూడా పాగా వేయాలని పలు ప్రయత్నాలే చేసింది. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. ఇక ఏదో ఒక రకంగా అక్కడ తన బలం పెంచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కమల్ హాసన్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. మొదట్లో బీజేపీకి కాస్త అనుకూలంగా మాట్లాడిన కమల్..ఆతరువాత మాత్రం బీజేపీని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మీద.. మోడీ ప్రభుత్వ తీరు పై ఎన్నో విమర్శలు గుప్పించారు. దీనికి తోడు ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టాడు. అంతేకాదు బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతేనే రజనీతో కలిసి పని చేస్తానని తేల్చిచెప్పాడు కూడా. దీంతో కమల్ తీరుపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఈ సమయంలోనే కమల్‌ను రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు, వ్యక్తిగతంగా కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు చేయడానికి బరిలో దిగినట్టు తెలుస్తోంది. అందుకు గౌతమినీ రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి.
కమల్ హాసన్, గౌతమిలు కొంతకాలం సహజీవనం సాగించిన సంగతి తెల్సిందే కదా. అయితే కొన్ని కారణాల వల్ల ఈమద్యనే వారిద్దరూ విడిపోయారు. దీంతో వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు గౌతమి గత కొంత కాలంగా బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వస్తుంది. ఇక బీజేపీ కూడా గౌతమితో కమల్ ను దెబ్బకొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే.. గౌతమి కూడా మోడీ డైరెక్షన్ తో కమల్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే... కమల్ హాసన్ చేసిన పలు చిత్రాలకు తాను కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మరియు ఇంకా పలు పనులు చేశాను అని, వాటికి సంబంధించిన పారితోషికాలు తనకు ఇవ్వలేదని, కమల్ తనకు బాకీ పడ్డాడు అంటూ తాజాగా గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి బీజేపీ ప్లాన్ ను కమల్ ఏ విధంగా తిప్పికొడతారో చూద్దాం..