కేసీఆర్ పిలిస్తే వెళ్తా... కవిత సంచలన వ్యాఖ్యలు
posted on Nov 9, 2025 11:31AM

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న… ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ తిరగడం… జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేయడం తప్ప ప్రజల సమస్యలపై...అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో అన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా... జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ముందుగా పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయుల కాలంలో నిర్మించిన మాదన్నపేట చెరువును సందర్శించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
కట్ట పై గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాలల అధ్యాపకులు ఫీజు రియంబర్స్మెంట్ పై వినతిపత్రం జాగృతి అధ్యక్షురాలు కవితలు అందించారు. అనంతరం కవిత మాట్లాడుతూ... జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గాలలోని ప్రజలకు సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ జాగృతి జనం బాట కార్యక్రమం చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గం రావడం జరిగిందని నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు.
ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట చెరువుకు సంబంధించి పట్టేవాగుపై లో లెవెల్ వంతెన నిర్మాణంతోపాటు... చెరువు మత్తడి ఎత్తు పెంచి నిర్మించవలసి ఉన్నదని... ఆ విధంగా నిర్మించినట్లయితేనే ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుందని తెలిపారు. లో లెవెల్ వంతెన మత్తడి ఎత్తు పెంచేందుకు ఇంతకుముందే టెండర్ అయినట్టు తెలిసిందని, ఆ రెండు నిర్మించలేదని ఈ రెండిటిపై స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలోని నల్లవెల్లి మార్గం రోడ్ అంతా గుంతలు ఏర్పడిందని ఎప్పటికప్పుడు రోడ్లు మరమ్మతులు చేయవలసి బాధ్యత ప్రభుత్వం పై ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న ఇప్పుడు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేయడం తప్ప ప్రజల సమస్యపై కానీ అభివృద్ధి పైన కానీ ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదు అన్నారు. అదేవిధంగా నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీలోను అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం పూర్తి చేయలేదని 150 పడకల ఆసుపత్రి తగ్గట్టు ఇంతవరకు ఏర్పాట్లు పూర్తి కాలేదని ఈ సమస్యపై శ్రద్దపెటంటలని అన్నారు.
మొంథా తుఫాను ప్రభావంతో పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని మొక్కుబడిగా సమావేశం నిర్వహించారని అన్నారు. అధికారులను లోతుగా సర్వే చేయించి రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా... కళాశాలలకు సంబంధించి ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అవమానకరంగా బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షోకాజు నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని తెలిపారు. తండ్రిగా కేసీఆర్ పిలిస్తే ఇంటికి వెళ్లానని కానీ బీఆర్‌ఎస్‌కు తనకు సంబంధం లేదని స్ఫష్టం చేశారు. ఈ చర్య వెనుక పార్టీలోని కొందరి కుట్ర ఉందని ఆరోపించారు.