Latest News

ఎర్రబెల్లి.. అందని ద్రాక్ష...

posted on: Oct 13, 2014 2:32PM

 

ఓ కథ అందరికీ తెలిసిందే. అనగనగా ఓ నక్క. ఆ నక్కకి ఓ రోజున వెళ్తూ వెళ్తూ తల పైకెత్తి చూస్తే పైన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. వాటిని సొంతం చేసుకోవడానికి నక్క రకరకాల ఫీట్లు చేసింది. ఎంత ఎగిరినా ద్రాక్షని అందుకోలేకపోయింది. చివరకు ద్రాక్షల కోసం పైకి ఎగిరీ ఎగిరీ నక్క నడుం కూడా బెణికింది. చివరికి నక్క ‘ఈ ద్రాక్షలు బాగోవు.. ఇవి పుల్లటి ద్రాక్షలు’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వైఫల్యాన్ని ఆ నక్క ద్రాక్ష పళ్ళ మీదకి నెట్టేసింది. ఈ కథకి, టీఆర్ఎస్ - ఎర్రబెల్లికి మధ్య పోలిక వుందని తెలంగాణ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. నక్కకి అందని ఆ ద్రాక్షే ఎర్రబెల్లి అంటున్నాయి.


తెలంగాణలో టీడీపీని బలహీనం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆకర్ష’ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. తాజాగా ముగ్గురు టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చెబుతున్న కారణాలు మరీ విచిత్రంగా వున్నాయన్న అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. ధర్మారెడ్డి అనే ఎమ్మెల్యే చెప్పే కారణం అయితే మరీ కామెడీగా వుంది. తాను టీఆర్ఎస్‌లో చేరితే తన నియోజకవర్గం అభివృ‌ద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వందల యాభై కోట్లు ఇస్తాననేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నాడట. సరే, వీళ్ళ సంగతి అలా వుంచితే, టీఆర్ఎస్ గాలం వేసిన పెద్ద చేప ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం చిక్కలేదు. ‘మనం మనం ఒకటి’ అని సామాజిక వర్గం కోణంలో ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు. ప్రజల సమస్యల ప్రస్తావనకు ముఖ్యమంత్రి స్థానంలో వున్న కేసీఆర్‌ని కలవటానికి ఎర్రబెల్లి వెళ్తే, దానికి పార్టీ మారడానికే కలిశారంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి మాత్రం తాను ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదన్న తన మాటకు కట్టుబడి వున్నారు. దాంతో టీఆర్ఎస్ ఎర్రబెల్లి మీద ఆశలు వదిలేసుకుంది.


ఎర్రబెల్లి మీద ఆశలు వదులుకున్న టీఆర్ఎస్ అక్కడితో ఆగకుండా ఎర్రబెల్లి పుల్లని ద్రాక్ష అంటూ ప్రచారం మొదలుపెట్టింది. దానికోసం టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి సేవలను ఉపయోగించుకుంటోంది. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకరరావు మీద విమర్శల మీద విమర్శలు కురిపిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుని టీఆర్ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదని అనడం మొదలుపెట్టారు. ఎర్రబెల్లి కేసీఆర్ని అర్ధరాత్రిపూట ఎందుకు కలిశారో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏ గడ్డి పీకినా ఎర్రబెల్లిని టీఆర్ఎస్‌లో అడుగు పెట్టనిచ్చేదే లేదని చెబుతున్నారు. ఒకవైపు స్వయానా ఎర్రబెల్లే నేను టీఆర్ఎస్‌లోకి రాను మొర్రో అంటూ వుంటే మరోవైపు కడియం చేస్తున్న కామెంట్లు పుల్లటి ద్రాక్షపళ్ళ కథని గుర్తుకు తెచ్చేలా వున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...