మ‌న శ్రీచ‌ర‌ణి.. ఉప్పొంగె ధ‌ర‌ణి

అది ఏపీలోని క‌డ‌పజిల్లాలోని, య‌ర్రంప‌ల్లె అనే ఒక మారుమూల గ్రామం. అలాంటి గ్రామం నుంచి పుట్టుకొచ్చిందో భార‌త క్రికెట్ క్రీడా కుసుమం. ఆమె పేరే శ్రీచ‌ర‌ణి. శ్రీచ‌ర‌ణి  పూర్తి పేరు న‌ల్ల‌పురెడ్డి శ్రీచ‌ర‌ణి.  21 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్ధోడాక్స్ స్పిన్న‌ర్ శ్రీచ‌ర‌ణికి  అంత‌ర్జాతీయ క్రికెట్ లో తొలి అడుగులివి. ఈ ఏడాది ఏప్రిల్ లో శ్రీలంక‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆమె ప్ర‌పంచ క‌ప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం అద‌ర‌క బెద‌ర‌క సత్తా చాటింది. తన తొలి ప్రపంచ కప్‌ టోర్నీలోనే జ‌ట్టులో కీలక పాత్ర పోషించిన ఈ కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది.  ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 22 వికెట్ల‌తో రాణించి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత అత్య‌ధికంగా అంటే 13 వికెట్లు తీసి సెకండ్  బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది క‌డ‌ప బిడ్డ శ్రీచ‌ర‌ణి. త‌న క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ తో ప‌రుగులు పెద్ద‌గా ఇవ్వ‌కుండా,అత్యంత ఎకనామిక్ గా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెంచింది.

ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత సెమీ పోరులో భార‌త బౌల‌ర్లు అప‌రిమితంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటుంటే శ్రీచ‌ర‌ణి మాత్రం త‌న ప‌ది ఓవ‌ర్ల స్పెల్ లో   4. 9 ఎకాన‌మీతో కేవ‌లం 49 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టింది.  త‌న‌దైన‌ బౌలింగ్  శైలితో ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసి, భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించింది శ్రీ చ‌ర‌ణి. ఇక ఫైనల్ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్​లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి  ఒక వికెట్ సైతం తీసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.  తమ  బిడ్డ ప్ర‌పంచ మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క పాత్ర పోషించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్ర‌శంస‌లు పొందడం   అదృష్టంగా చెబుతున్నారు ఆమె త‌ల్లిదండ్రులు న‌ల్ల‌పురెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి,  రేణుక.  

శ్రీచ‌ర‌ణి చిన్న‌ప్పుడు ఖోఖో, బ్యాడ్మింట‌న్ ఎక్కువ‌గా ఆడేద‌ని చెప్పిన త‌ల్లిదండ్రులు. ఆరో త‌ర‌గ‌తి వరకూ ఈ క్రీడ‌లు ఆడిన శ్రీచ‌ర‌ణి క‌రోనా టైంలో క్రికెట్ పై మ‌క్కువ పెంచుకుంది. మేన‌మామ కిషోర్ కుమార్ రెడ్డి స‌హ‌కారంతో.. హైద‌రాబాద్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది. శ్రీచ‌ర‌ణి ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్.. వీరపునాయునిపల్లె, ఆర్టీపీపీ డీఏవీ పాఠశాలలో సాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో చదివింది. వీరపునాయునిపల్లె- వీఆర్ఎస్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది శ్రీచరణి.

క్రికెట్​లో ముందుగా ఫాస్ట్ బౌలింగ్​పై దృష్టి పెట్టిన ఈ మ‌ట్టిలో మాణిక్యం ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్​గా రూపాంత‌రం చెందింది. మంచి టెక్నిక్​తో ఆఫ్ స్పిన్నర్ గా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. 2024 డిసెంబర్​లో  విమెన్ ప్రీమియర్ లీగ్ వేలంపాటలో ఢిల్లీ కేపిటల్ ప్రాంచైజీ శ్రీ చరణిని  55 లక్షల రూపాయలకు దక్కించుకుంది.  శ్రీచరణి 2025లో తన తొలి ఫస్ట్ క్లాస్ట్ క్రికెట్ టోర్నీలో  ఫైవ్ వికెట్ హాల్ తీసి అందరి దృష్టిని ఆక‌ట్టుకుంది. 2022లో  శ్రీచ‌ర‌ణి ఆంధ్రా విమెన్స్ క్రికెట్ టీమ్ తరపున ఆడింది. క్రికెట్​లో బాగా రాణిస్తున్న శ్రీచరణికి ఇంట‌ర్నేష‌న‌ల్ వన్డే విమెన్స్ క్రికెట్ టోర్నీలో అడుగు పెట్టే అవకాశం ల‌భించింది. 2025 ఏప్రిల్ 27న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్​లో శ్రీచరణి అరంగేట్రం చేసింది. 2025 జూన్ 28న ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్​లకు ఎంపికైంది. ఇప్పటివరకు 18 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్​లు ఆడిన శ్రీచరణి 23 వికెట్లు పడగొట్టింది. 5 టీ20 మ్యాచ్​లు ఆడిన మ‌న‌ తెలుగమ్మాయి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.

శ్రీచ‌ర‌ణిది చాలా చాలా సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. యర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారు శ్రీచరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. అక్కడి ప్రాజెక్ట్ క్వార్టర్​లో నివాసం ఉంటున్నారు. క‌డ‌ప జిల్లా నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఒక క్రికెట‌ర్ ఎద‌గ‌డం ఇదే తొలిసారి అంటూ ఈ ప్రాంత వాసులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. విమెన్స్ ఇండియా జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ కొల్ల‌గొట్ట‌డంతో ఇక్క‌డి వారి  ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu