కాదంబరి జత్వానీ కేసులో బలిపశువులు ఎవరు..?

posted on: Jul 22, 2026 4:50PM

 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, పోలీస్ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం, మరోవైపు తానూ బలిపశువునయ్యానంటూ లేఖలు బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాదంబరి జత్వానీ   కేసులోని పలు కీలక అంశాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి..  ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు. 

అయితే, ముంబైలో దాఖలైన ఒక రేప్ కేసును ఉపసంహరించుకోవడానికి తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకే ఈ అక్రమ అరెస్టులు నిర్వహించారని విచారణలో తేలింది. దీని వెనుక ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ఒక ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ నడిచిందని అప్పసాని రాజేష్ చెప్పారు.  ఏపీ సీఐడీ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయనీ,  కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయకముందే సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయినట్లు తేలిందనీ గుర్తు చేసిన ఆయన, అప్పుడు  సీఎమ్‌ఓలో కీలక పాత్ర పోషించిన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే తమ బృందం ముంబై వెళ్లినట్లు అధికారులు విచారణలో వెల్లడించారని వివరించారు. 

రాజకీయ ప్రయోజనాలు, మోరల్ పోలీసింగ్ కోసం అప్పటి వైసీపీ  ప్రభుత్వం అధికారులను దుర్వినియోగం చేసిందనీ, రాజకీయ నాయకుల ఆదేశాలు అమలు చేసి ఈ వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులు సస్పెన్షన్లకు గురై సీఐడీ కేసుల్లో ముద్దాయిలుగా మారారనీ చెప్పారు.

కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ కోర్టును ఆశ్రయించి ఛార్జ్‌షీట్ సమర్పించడంతో విచారణ తుది దశకు చేరుకుంది. రాజకీయ లబ్ధి కోసం ఉన్నతాధికారులను బలిపశువులను చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది. నిబంధనలను పక్కనబెట్టి వ్యవహరించిన అధికారులపై సీఐడీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Kadambari Jethwani Case, AP CID Chargesheet, AP IPS Officers Suspension, Tone News AP Politics, Kadambari Jethwani Latest News

google-ad-img
    Related Sigment News
    • Loading...