ఆయన హైకోర్ట్ జడ్జ్! కాని, జైలుకి పంపమని అడుగుతున్నాడు!

posted on: Mar 31, 2017 5:35PM

 

నన్ను జైలుకి పంపండి… ఇలా అన్నది ఎవరో తెలుసా? కోల్ కతా హైకోర్ట్ జడ్జుల్లో ఒకరైన సీఎస్ కర్నన్! వినటానికే ఆశ్చర్యంగా వుంది కదా? ప్రతీ రోజూ నేరస్థుల్ని జైలుకి పంపే ఒక న్యాయమూర్తే తనని జైలుకి పంపమని అడిగాడంటే సమస్య తీవ్రత ఎంతగా వుందో అర్థం చేసుకోవచ్చు! అసలు ఇంతకీ సుప్రీమ్ కోర్టు జడ్జులతో జగడానికి దిగిన కర్నర్ కి ఏమైంది? ఎందుకని ఆయన నేను ఒక్కడని ఒకటైపు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు?

 

సీఎస్ కర్నన్ కోల్ కతా హైకోర్ట్ న్యాయమూర్తుల్లో ఒకరు. 61ఏళ్ల ఆయన చాలా సీనియర్! అయితే, గొడవంతా ఆయన ఆ మధ్య ఇష్టానుసారం ఆరోపణలు చేయటంతో వచ్చి పడింది! మన కోర్టుల్లోని టాప్ 20 జడ్జెస్ అవినీతి పరులంటూ పేరు పేరున ఆరోపణలు గుప్పించాడు! అది సీరియస్ గా తీసుకున్న సుప్రీమ్ సార్ వార్ని కోల్ కతా నుంచి ఢిల్లీ వచ్చిపొమ్మని పదే పదే చెప్పింది. కాని, విచారణకు తాను హాజరు కానని భీష్మించిన ఆయన విచిత్రంగా సుప్రీమ్ కోర్టు జడ్జీల మీదనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాడు! ఇక లాభం లేదనుకుని మార్చి 31న తప్పకుండా కోర్టుకు రావాల్సిందేనని సుప్రీమ్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కర్నన్ కి!

 

వారెంట్ దాకా వ్యవహారం రావటంతో సుప్రీమ్ కు వచ్చిన జస్టిస్ కర్నన్ తనదైన రీతిలో కేసు వాదించుకున్నాడు. నాలుగు వారాల తరువాత కోర్ట్ ముందుకు తగిన వివరణతో రావాలని చీఫ్ జస్టిస్ చెబితే… రానని తెగేసి చెప్పాడు. అంతే కాదు, కోల్ కతా హైకోర్ట్ జడ్జ్ గా తన బాధ్యతలు తనకు అప్పజెప్పాలనీ, లేదంటే అరెస్ట్ చేసుకోవాలని కోర్టుకే సూచించాడు! మరోసారి మాత్రం తాను కోర్టుకి రానని చెప్పేసి బయటకొచ్చాడు కర్నన్!

 

ఇరవై మంది న్యాయమూర్తులు అవినీతి పరులన్న కర్నన్ తాను దళితుడ్ని కాబట్టే వేధిస్తున్నారంటూ కులం కార్డ్ కూడా ప్రదర్శించాడు. ఆయన చేసిన ఆరోపణల్లో నిజం లేదని మనం చెప్పలేం కాని… నిరూపించటం సాధ్యం కాదు. అలాగని బేషరతుగా క్షమాపణ చెప్పమంటే కర్నన్ అంగీకరించటం లేదు. మొత్తం మీద సీఎస్ కర్నన్ వ్యవహారం మన న్యాయ వ్యవస్థలో వున్న అవినీతి ఆరోపణలపై అందరి దృష్టిని ఆకర్షించింది. కాని, చరిత్రలోనే తొలిసారి ఒక న్యాయమూర్తి సుప్రీమ్ లో విచారణ ఎదుర్కుంటుండటం ఈ కేస్ మరో ప్రత్యేకత! మరి అటువంటి సెన్సేషనల్ అండ్ కాంట్రవర్సియల్ కేసులో సుప్రీమ్ జడ్జులు ఎలా ముందుకు పోతారో చూడాలి!

 

గతంలోనూ మద్రాస్ హైకోర్ట్ నుంచి కోల్ కతా హైకోర్ట్ కు ట్రాన్స్ ఫర్ అయిన కర్నన్ … ఆ ట్రాన్స్ ఫర్ ను తనకు తానే స్టే చేసుకున్నాడు! మళ్లీ తన మానసిక ఆరోగ్యం బాగోలేక అలా చేశానని క్షమాపణలు చెప్పాడు! మరి ఈసారి చివరకు ఏం చేస్తాడో!

google-ad-img
    Related Sigment News
    • Loading...