ఎన్టీఆర్ ని పట్టించుకోని నందమూరి ఫ్యాన్స్..!
posted on Apr 23, 2014 11:19AM
.jpg)
నటరత్న, విశ్వవిఖ్యత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అంది పుచ్చుకున్నారు. సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా నాన్న వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. ఈ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తారని నందమూరి అభిమానులు గతంలో భావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి కొరుకుడు పడని విధంగా, నందమూరి కుటుంబానికి దూరంగా వెళ్తున్న విధంగా వుండటంతో నందమూరి వంశాభిమానులందరూ క్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌కి దూరమవుతున్నారు.
నందమూరి ఫ్యాన్స్ జూనియర్‌కి దూరం కావడం వల్లే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడం లేదన్న అభిప్రాయాలు వున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే భారీ స్థాయిలో హడావిడి చేసే నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఊరుకుంటున్నారు. దీనివల్ల ఆయన సినిమాలు రిలీజైన థియేటర్లు మొదటి రోజు నుంచే చల్లగా వుంటున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కి, తమకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా నందమూరి వంశాభిమానులు వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ ఎన్నికలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకోకపోవడం, ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎలాంటి స్పందన లేకపోవడంతో నందమూరి వంశాభిమానులతో ఆయనకున్న దూరం మరింత పెరిగింది. వీరి మధ్య ఏర్పడిన గ్యాప్‌లో నందమూరి వంశాకురం నందమూరి మోక్షజ్ఞ ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞను అభిమానించే వారి సంఖ్య బాగా పెరిగింది. నందమూరి వంశానికి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాదని, సినిమా వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞే అసలైన వారసుడని అభిమానులు అంటున్నారు. తాజాగా మోక్షజ్ఞ తెలుగుదేశానికి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వుండటం కూడా ఆయన మీద అభిమానుల అభిమానం మరింత పెరగడానికి కారణమైంది. మోక్షజ్ఞ వెండితెర మీదకి ఎంట్రీ ఇచ్చి, ఒక్క భారీ హిట్ కొట్టాడంటే చాలు నందమూరి వంశాభిమానులందరూ మోక్షజ్ఞ వైపు పూర్తిగా షిఫ్ట్ అయిపోయే అవకాశం వుంది.