ఎన్టీఆర్ జయంతి.. జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి

posted on: May 28, 2026 8:54AM

తెలుగు సినీ యవనికపై, రాజకీయ రంగంపైన చెరగని ముద్ర వేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు   జయంతి వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మే 28న వచ్చే ఈ పవిత్రమైన రోజున నందమూరి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాన్ని స్మరించుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్ ఘాట్ ను రంగురంగుల పువ్వులతో, పచ్చటి ఆకులతో  సుందరంగా  అలంకరించారు.

గ్లోబల్ స్టార్ , జూనియర్ ఎన్టీఆర్  గురువారం (మే 28) తెల్లవారుజామునే తన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. నందమూరి సోదరులు ఇద్దరూ   భక్తిశ్రద్ధలతో తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారిద్దరూ నేలపై కూర్చుని,  కాసేపు మౌనం పాటించి, ఎన్టీఆర్ గొప్ప ఆశయాలను, వారసత్వాన్ని స్మరించుకుంటూ  భావోద్వేగానికి లోనయ్యారు.

నందమూరి హీరోలు ఘాట్ వద్దకు వస్తున్నారనే సమాచారం ముందుగానే తెలుసుకున్న అభిమానులు తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ ఘాట్ పరిసర ప్రాంతాలకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌ను చూడగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "అన్న.. అన్న" అంటూ, "జై ఎన్టీఆర్.. జోహార్ ఎన్టీఆర్" అంటూ వారు చేసిన నినాదాలతో హుస్సేన్ సాగర్ తీరమంతా   మార్మోగిపోయింది.  

తన సినీ కెరీర్‌లో దాదాపు 300 చిత్రాల్లో నటించి, మూడు జాతీయ అవార్డులను అందుకున్న సీనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి మూడు పర్యాయాలుగా మొత్తం 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...