ఐపీఎల్‌ 2026.. జూనియర్ ధోని.. ముకుల్ చౌదరి

posted on: Apr 10, 2026 11:05PM

ఐపీఎల్ 2026 సీజన్ భారతీయ యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనలకు వేదికగా నిలుస్తోంది. వైభవ్ సూర్యవంశీ, సమీర్ రిజ్వీ, ప్రియాంష్ ఆర్య, అంగ్‌క్రిష్ రఘువంశీ వంటి యువ ఆటగాళ్లు తమ దూకుడైన బ్యాటింగ్, బౌలింగ్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు.  తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లోనే 54 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు అనూహ్య వియజం అందించాడు. అందులో ఏకంగా 7 సిక్సర్లు ఉండటం విశేషం.  కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపు ఖాయమని అనుకుంటున్న సమయంలో ఎల్ఎస్‌జీకి హీరోలా వచ్చాడు ముకుల్. పరుగుల దాహంలో విరాట్ కోహ్లీ.. ఫినిషర్‌లో ధోనిని తలపించేలా అద్భుతమైన షాట్లతో విరుచుకుపడుతూ.. కేకేఆర్ నుంచి గెలుపును సరదాగా లాగేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. 

ఈ 22 ఏళ్ల ముకుల్ చౌదరి స్వస్థలం రాజస్థాన్. తన కొడుకు క్రికెటర్ అవ్వాలని ముకుల్ తండ్రి ఎన్నో కలలు కనేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నతనం నుంచే ఆ దిశగా నడవలేకపోయాడు. ఎలాగైనా తన కుమారుడిని క్రికెటర్‌ని చేయాలనే పట్టుదలతో ముకుల్ తండ్రి.. తమ ఇంటినే అమ్మేసి ఎస్‌బీఎస్ అకాడమీలో చేర్పించాడు. అప్పటికి ముకుల్ వయసు 12 ఏళ్లు. అక్కడే దాదాపు ఐదేళ్లు శిక్షణ తీసుకున్నాడు. అక్కడ నుంచి జైపుర్ వెళ్లి నాలుగేళ్లపాటు ప్రాక్టీస్ చేశాడు. ఓసారి అండర్ 19 మ్యాచులో యూపీపై తన ఆటను చూసిన తర్వాత ముకుల్ తండ్రికి భరోసా వచ్చిందట. 2026 ఐపీఎల్ మినీ వేలంలో ముకుల్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు. అతడిని లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఏకంగా రూ.2.60కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌లో ఇంత మంది ప్లేయర్లు ఉన్నప్పటికీ ఫినిషర్ అంటే ముందుగా ధోనినే గుర్తొస్తాడు. అయితే ఫినిషర్‌గా మ్యాచ్‌ను గెలిపించాలంటే తీవ్ర ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. అలాంటి పాత్రలో వచ్చిన ముకుల్.. అద్భుతం చేసి చూపించాడు. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 8వ వికెట్‌కు అవేశ్ ఖాన్‌తో కలిసి 24 బంతుల్లో 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అందులో ముకుల్ 21 బంతుల్లో 52 పరుగులు బాదేశాడు. అయితే ముకుల్ చౌదరికి ధోని అంటే చాలా ఇష్టమట. ధోనినే రోల్ మోడల్‌గా తీసుకుని క్రికెట్ అరంగేట్రం చేశాడట. అయితే ముకుల్ కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కావడం కొసమెరుపు. ఈ మ్యాచ్‌లోనూ ధోనిలా ‘హెలికాప్టర్ షాట్’తో సిక్స్ బాదడం.. చివరి ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాది జట్టును గెలిపించి సంచలనంగా మారాడు.

google-ad-img
    Related Sigment News
    • Loading...