జొన్నగిరి కంటే కుప్పం భూముల్లోనే ఎక్కువ బంగారం!

posted on: Jun 29, 2026 6:00PM

 

కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?

రాయలసీమ.. రతనాల సీమ అంటారు. ఆ మాటేమో కాని ఇప్పుడు పసిడి గనులకు సీమ  కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది.  తాజాగా కుప్పం ప్రాంతంలోనూ బంగారం ఉత్పత్తి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జొన్నగిరితో పోలిస్తే కుప్పంలోని ముడి ఖనిజంలోనే బంగారం ఎక్కువ ఉంది. అయితే కుప్పం ప్రాంతంలో ఖనిజం భూగర్భంలో ఉండటంతో మైనింగ్‌కు ఎక్కువ ఖర్చవుతుంది. కుప్పం సమీపంలోని చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం కర్ణాటకలోని కోలార్‌కు చేరువగా ఉండటంతో దశాబ్దాల క్రితమే ఇక్కడ బంగారం కోసం తవ్వకాలు చేపట్టి.. ఇక్కడి మట్టిని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌కు తీసుకెళ్లి శుద్ధి చేసేవారు.  


జొన్నగిరి ప్రాంతంలోని కొన్ని గనుల్లో 1 టన్ను ముడి ఖనిజం నుంచి 1.5 గ్రాముల వరకు బంగారం వస్తుంది. కొన్ని ప్రత్యేక జోన్లలోనే 4-5 గ్రాముల బంగారం వస్తుంది.  కుప్పంలోని బిసానత్తంలో 1 టన్ను ముడి ఖనిజం నుంచి 4 గ్రాముల బంగారం వెలికి తీయొచ్చు.  అయితే జొన్నగిరి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కావడంతో తక్కువ ఖర్చవుతుంది. అదే కుప్పం ఏరియాలో ఇప్పటికే ఉపరితలం మీద  ముడి ఖనిజాన్ని తవ్వేయడంతో,  భూగర్భంలో తవ్వకాలు జరపాల్సి ఉండటంతో,  ఖర్చు ఎక్కువ. గనుల్లో లోతుకు వెళ్లే కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. భూమి లోతుల్లో తవ్వకాలతో నష్టాలు రావడంతో కేజీఎఫ్‌తోపాటు చిగురుగుంట, బిసానత్తం గనుల్లో తవ్వకాలను గతంలో పూర్తిగా నిలిపేశారు. 

ప్రస్తుతం బంగారం ధరలు పెరగడం, టెక్నాలజీ పెరగడంతో మళ్లీ తవ్వకాలు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 2018 నుంచి ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 2018లో మైనింగ్‌కు ఎన్ఎండీసీ బిడ్ దక్కించుకుంది.
 కానీ రైతుల అభ్యంతరంతో పూర్తి స్థాయి లైసెన్స్ పొందలేకపోయింది. 2026 ప్రారంభంలోనూ టెండర్లు పిలిచినా ఖరారు చేయకుండానే రద్దు చేశారు. ఇప్పుడు మూడో సారి టెండర్లు పిలవగా.. జూలై 9 వరకు బిడ్లు దాఖలు చేయనున్నారు.  చిగురుగుంటలో 20 లక్షల టన్నులకు పైగా బంగారం ఖనిజ నిల్వలు ఉండగా.. బిసానత్తంలో 1.7 లక్షల టన్నులకుపైగా ఖనిజం ఉందని అంచనా వేస్తున్నారు. 

అయితే కుప్పం ప్రాంతంలోని ముడి ఖనిజం సాధారణ రకం కాదని, బంగారం వేరు చేయడానికి  అత్యాధునిక టెక్నాలజీతోపాటు సంక్లిష్టమైన రసాయన క్రియలు అవసరకమంటున్నారు.  బంగారం శుద్ధికి భారీ స్థాయిలో నీరు అవసరం అవుతుందంట. జొన్నగిరిలో భూమి ఉపరితలం నుంచి 100-150 మీటర్ల లోతులో బంగారం లభిస్తుంది. కుప్పం ప్రాంతంలో 300 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోతు సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. మరి గతంలో కేజీఎస్ చేతులెత్తేసిన చోట ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ఎందవరకు ఫలిస్తాయో చూడాలి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...