ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు.. వాషింగ్టన్ వేదికగా గళమెత్తిన జైశంకర్

posted on: May 25, 2026 2:38PM

అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన చారిత్రక 250వ వార్షికోత్సవ వేడుకలు వాషింగ్టన్ డి.సి.లో అత్యంత వైభవంగా జరిగాయి. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ  కార్యక్రమానికి ఇండియా తరఫున తరఫున విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా అమెరికా ప్రభుత్వానికి అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.  రెండు అగ్రశ్రేణి ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక అనుబంధాన్ని  ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సిన చారిత్రక అవసరాన్ని గుర్తు చేస్తూ..   ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఇరు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని,  జీరో టాలరెన్స్ విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఆకాంక్షించారు.  ఈ అంతర్జాతీయ సదస్సులో అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు సెక్రటరీ మార్కో రూబియో, అంబాసిడర్ సెర్గియో గోర్‌లతో పాటు పలువురు దౌత్యవేత్తలు పాల్గొన్నారు. వారందరినీ ఉద్దేశించి మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. అమెరికా నూతన పరిపాలనా విభాగానికి, ఆ దేశ పౌరులకు భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు అందజేశారు. 

అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలో పొందుపరిచిన ప్రాథమిక సూత్రాలైన వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయబద్ధమైన పరిపాలన, వాక్ స్వాతంత్ర్యం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వ వ్యవస్థ వంటివి ఆధునిక ప్రపంచ రూపురేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషించాయని ప్రశంసించిన జైశంకర్.. ఈ ప్రగతిశీల ఆలోచనలు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులను,  ప్రజాస్వామ్య ఉద్యమాలను ఎంతగానో ఉత్తేజపరిచాయన్నారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన భారత్‌కు ఈ విలువలు ఎంతో సహజ సిద్ధమైనవని  విశ్లేషించారు.  భారత రాజ్యాంగ రూపకల్పన సమయంలో కూడా  అమెరికా సమాఖ్య వ్యవస్థలోని, ప్రజాస్వామ్య ప్రక్రియలలో  ఉత్తమ అంశాలను, ప్రజాభిప్రాయ సేకరణ పద్ధతులను పరిశీలించి అన్వయించుకున్నారని జైశంకర్ గుర్తుచేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్, అమెరికాలు ఒకే విధమైన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలను, స్వేచ్ఛాయుతమైన మార్కెట్ ఆర్థిక విధానాలను, బహుళత్వంతో కూడిన సామాజిక నిర్మాణాలను కలిగి ఉండి ప్రపంచ గమనానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని  చెప్పారు. 

గతంలో ఇరు దేశాల మధ్య ఉన్న కొన్ని చారిత్రక బేధాభిప్రాయాలను లేదా  చరిత్ర సంకోచాలను  ప్రస్తుత వ్యూహాత్మక జాతీయ ప్రయోజనాల ఆధారంగా అధిగమించడం సాధ్యమైందన్న ఆయన..   ప్రస్తుత తరుణంలో ఇరు దేశాల మధ్య సహకారం కేవలం సాంప్రదాయ రంగానికే పరిమితం కాకుండా వినూత్న రంగాలు, సాంకేతిక పరిజ్ఞానాల వైపు విస్తరిస్తోందన్నారు. రక్షణ, భద్రత, పరస్పర పెట్టుబడులు,  వాణిజ్య పటిష్టతతో పాటు భవిష్యత్తును శాసించే కీలక రంగాలైన సెమీకండక్టర్ల తయారీ, ఏఐ, అంతరిక్ష పరిశోధనలు, హరిత ఇంధనం, ఉన్నత విద్యా ప్రమాణాలు, వైద్య రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం విలువలను జోడించుకుంటూ ముందుకు సాగుతున్నాయనీ,  ఈ సమగ్ర భాగస్వామ్యం రెండు దేశాల పురోగతికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఈ ప్రసంగంలో అత్యంత కీలకమైన అంశం ఉగ్రవాద నిర్మూలనపై ఆయన చేసిన స్పష్టమైన ప్రకటన. ప్రపంచవ్యాప్తంగా ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదాన్నయినా సంపూర్ణంగా అణచివేయడంలో భారత్,  అమెరికాల భద్రతా ప్రయోజనాలు, ఉమ్మడి ఆసక్తులు ముడిపడి ఉన్నాయని జైశంకర్ ఉద్ఘాటించారు. ఉగ్రవాద చర్యలను అడ్డుకోవడంలో ఎలాంటి మినహాయింపులకు గానీ, సందేహాలకు గానీ తావుండకూడదని ఆయన కరాఖండీగా చెప్పారు. ఇరు దేశాల రక్షణ దౌత్యంలో ఉగ్రవాద నిరోధక సహకారమే అత్యంత ప్రధానమైన  కేంద్ర బిందువుగా కొనసాగుతుందని, ఇది మన సంస్కృతిని, ప్రజాస్వామ్య రక్షణను ప్రతిబింబిస్తుందని ఆయన వివరించారు

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...