జోగి రమేష్ కుటుంబంపై కోడలు ఫిర్యాదు..11 మందిపై కేసు.. !

posted on: Jul 27, 2026 9:38AM

 

అదనపు కట్నం కోసం వేధించి, చంపేందుకు చూశారు.. సంచలన ఫిర్యాదు..!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ కుటుంబంలో తీవ్ర వివాదం వెలుగులోకి వచ్చింది. ఆయన కోడలు మేఘన.. భర్త జోగి రాజీవ్‌తో పాటు మామ జోగి రమేష్, అత్త, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో గృహహింస, వరకట్న వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం, 2025 మే నెలలో తెలంగాణ సూర్యాపేటకు చెందిన మేఘనతో మేఘనకు జోగి రాజీవ్‌తో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.5 కోట్ల విలువైన కట్నకానుకలు, భారీగా బంగారం, వెండి సమర్పించినప్పటికీ.. అత్తింటివారి వేధింపులు తగ్గలేదని ఆమె వాపోయారు. పెళ్లయిన కొన్ని రోజుల నుంచే భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడం ప్రారంభించారని తెలిపారు.

అదనంగా మరో రూ.5 కోట్ల నగదు, లగ్జరీ కారుతో పాటు వజ్రాల హారాలు తీసుకురావాలని ఒత్తిడి చేశారని మేఘన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆమె పేరిట ఉన్న ఆస్తులను భర్త పేరుమీదికి బదిలీ చేయాలంటూ బెదిరింపులకు దిగారని వెల్లడించారు. భర్తకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలను దాచిపెట్టి పెళ్లి చేశారని కూడా ఆరోపించారు.

అంతటితో ఆగకుండా, తనను పలుమార్లు ప్రాణాలతో తీసేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆమె ఫిర్యాదులో పేర్కొనడం సంచలనం రేపింది. ఇంటి పైకప్పు నుంచి కిందకు తోసేసేందుకు, గోవా పర్యటనలో ఉన్నప్పుడు బోటు నుంచి నీటిలోకి నెట్టేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఒకానొక సందర్భంలో ముఖంపై దిండు నొక్కి, మెడకు చున్నీ బిగించి చంపేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దారుణ ఘటనలు బయటకు తెలిస్తే ఆమె తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టబోమని, తీవ్ర పరిణామాలు ఉంటాయని అత్తింటివారు బెదిరించినట్లు మేఘన వెల్లడించారు. భోజనం కూడా పెట్టకుండా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడి కుటుంబంలో ఇటువంటి తీవ్ర ఆరోపణలు వెలుగుచూడటంతో రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో కూడా పలు రాజకీయ వివాదాల్లో నిలిచిన మాజీ మంత్రి కుటుంబంపై ఇప్పుడు స్వయంగా కోడలే క్రిమినల్ ఆరోపణలు చేయడం గమనార్హం.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, కేసు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బాధితురాలి ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాలు, పౌర సమాజం డిమాండ్ చేస్తున్నాయి.

Jogi Ramesh, Jogi Rajiv, Meghana Domestic Violence Case, Andhra Pradesh Crime News, TeluguOne News

google-ad-img
    Related Sigment News
    • Loading...