ఏపీలో నకిలీ సర్టిఫికెట్ల కలకలం... 69 మంది ఉద్యోగుల తొలగింపు

posted on: Apr 6, 2026 4:56PM

 

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL)లో అర్హత లేకుండా అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన 69 మంది షిఫ్ట్ ఆపరేటర్లను సేవల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే... ఐటీఐ ఎలక్ట్రిషియన్ కోర్సు పూర్తి చేయకపోయినా పూర్తి చేసినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఈ ఉద్యోగులు విధుల్లో చేరినట్లు విచారణలో బయటపడింది. కొంతకాలంగా వీరి విద్యార్హతలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థ అంతర్గతంగా దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఉద్యోగాలు పొందినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన APSPDCL సీఎండీ శివశంకర్ లోతేటి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసి, సదరు ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి తొలగించారు.

జిల్లాల వారీగా తొలగింపులు:

కడప జిల్లా – 38 మంది
కర్నూలు జిల్లా – 16 మంది
చిత్తూరు జిల్లా – 4 మంది
నెల్లూరు జిల్లా – 4 మంది
తిరుపతి జిల్లా – 3 మంది
అనంతపురం జిల్లా – 3 మంది
అన్నమయ్య జిల్లా – 1 వ్యక్తి

మొత్తం 69 మందిపై చర్యలు తీసుకోవడం ద్వారా అక్రమాలకు ఎలాంటి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ వంటి సాంకేతిక, ప్రమాదకర రంగంలో అర్హతలేని వ్యక్తులు పనిచేయడం భద్రతకు ముప్పుగా మారుతుందని వారు హెచ్చరించారు.

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ మీసేవ కేంద్రాల ద్వారా పోలీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్  సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తప్పుడు సమాచారం ఇచ్చినా, క్రిమినల్ రికార్డులు ఉన్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అంతేకాదు, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తున్నారు. నియామక ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజెన్సీలపై కూడా నిఘా పెంచారు. ఈ చర్యలతో అక్రమంగా ఉద్యోగాలు పొందిన మరికొంతమందిలో భయం నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...