స్వేచ్ఛాయుత తాత్విక మార్గదర్శ.. జిడ్డు కృష్ణమూర్తి.!

posted on: Aug 16, 2026 7:52AM

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించిన ఒక సామాన్యుడు..   ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక వ్యవస్థల కేంద్రబిందువుగా మారి, ఆపై తన కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత పీఠాన్నే స్వయంగా రద్దు చేసిన స్వేచ్ఛాయుత తాత్విక చింతకుడిగా ఎదిగారు. ఆయన ప్రస్థానం   ఆధునిక ప్రపంచ మేధోచరిత్రలో   అరుదైనది. 1929 ఆగస్టు నాటి చారిత్రాత్మక సంఘటన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మదనపల్లె మహానీయుడు జిడ్డు కృష్ణమూర్తి. ప్రపంచ మానవాళికి విముక్తి కలిగించే  విశ్వగురువు గా తనను తీర్చిదిద్దేందుకు దశాబ్దాల పాటు సాగిన  ప్రయత్నాన్ని ఆయన ఒక్క నిర్ణయంతో నిరాకరించారు. ఆయన తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక ఏ విధమైన మత, సాంప్రదాయ సంకుచిత భావాలు లేవనీ.. కేవలం సంస్థాగత మతాలు,  మనుషులపై రుద్దబడే అధికారాల పట్ల ఆయన లేవనెత్తిన ప్రాథమిక ప్రశ్నలే కారణమని చరిత్రకారులు చెబుతున్నారు.  జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 11న మదనపల్లెలో ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జిడ్డు నారాయణయ్య బ్రిటిష్ పాలనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి..  అనంతరం చెన్నైలోని అడయార్ వద్ద ఉన్న థియోసాఫికల్ సొసైటీ  కేంద్ర కార్యాలయ పరిసరాలకు మారారు.  అక్కడే అప్పటికి బాలుడిగా ఉన్న  కృష్ణమూర్తి తాత్విక ఔన్నత్యాన్ని దివ్యజ్ఞాన సమాజ ప్రముఖ నాయకుడు చార్ల్స్ వెబ్‌స్టర్ లీడ్‌బీటర్ దృష్టిని ఆక్షర్షించింది. లీడ్‌బీటర్,  దివ్యజ్ఞాన సమాజ అధినేత్రి అన్నీ బిసెంట్‌లు ఈ బాలుడిలో అపారమైన తాత్విక చైతన్యాన్ని గుర్తించి, ఆయనే భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శనం చేసే గురువు అని విశ్వసించారు. 1875లో హెలెనా పెట్రోవ్నా బ్లావట్స్కీ,  హెన్రీ స్టీల్ ఆల్కాట్‌లు స్థాపించిన  దివ్యజ్ఞాన సమాజం..  అన్నీ బిసెంట్ నాయకత్వంలో కృష్ణమూర్తిని,  ఆయన సోదరుడైన జిడ్డు నిత్యానందుడిని ఇంగ్లండ్‌కు తీసుకెళ్లి  ఉన్నత విద్యను అందించడం ప్రారంభించింది.  కృష్ణమూర్తిని జగద్గురువుగా నిలబెట్టే ప్రణాళికలో భాగంగా 1911లో  ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్  అనే ఒక  సంస్థను స్థాపించారు.

 ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది సభ్యులను కలిగి ఉన్న ఈ సంస్థకు కృష్ణమూర్తిని అధిపతిగా నియమించారు. అయితే, సామాజిక మాధ్యమాలలో ప్రచారంలో ఉన్నట్లుగా పందొమ్మిదవ శతాబ్దంలోనే ఆయనను గురువుగా కొలిచారనేది తప్పు. ఆయన బాల్యం,  విద్యాభ్యాసం ఇరవయ్యో శతాబ్దపు తొలి దశాబ్దాలలో సాగాయి. అదే సమయంలో..  1912 నాటికి తన పిల్లల సంరక్షణ బాధ్యతలను తిరిగి పొందేందుకు తండ్రి జిడ్డు నారాయణయ్య అన్నీ బిసెంట్‌పై మద్రాస్ హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ  కేసు బ్రిటన్ ప్రివీ కౌన్సిల్ వరకు వెళ్లగా..  న్యాయస్థానాలు బాలుర సంక్షేమం,  తల్లిదండ్రుల హక్కుల ప్రాతిపదికగానే విచారణ జరిపాయి.  విశ్వగురువుగా తీర్చిదిద్దబడుతున్న ఒక బాలుడి జీవితంలో ఆరంభంలో తన సొంత నిర్ణయాలకు తావులేకుండా సంస్థాగత ప్రయోజనాలు రాజ్యమేలాయనే సత్యాన్ని ఈ న్యాయ వివాదం బయటపెట్టింది.  1925లో కాలిఫోర్నియాలోని ఒజై ప్రాంతంలో కృష్ణమూర్తి సోదరుడైన నిత్యానంద అకాల మరణం చెందడం ఆయన జీవితంలో ఊహించని పెద్ద మలుపుగా మారింది. దివ్యజ్ఞాన సమాజ  నాయకులు నిత్యానందుడికి అతీంద్రియ రక్షణ ఉందనే నమ్మకాన్ని కలిగించినప్పటికీ..  ఆయన మరణించడంతో కృష్ణమూర్తికి ఆధ్యాత్మిక పీఠాలు, ముందస్తు ప్రవచనాలు,  గురు వ్యవస్థలపై ఉన్న విశ్వాసం   సడలిపోయింది. 

ఈ మానసిక పరిణామమే ఆయనలో  ఆలోచనాత్మక మార్పుకు దారితీసింది. మనుషుల మానసిక స్వేచ్ఛకు మతాధికారాలు,  సంస్థాగత చట్రాలు ఎంతటి ముప్పుగా పరిణమిస్తాయో ఆయన  ఆలోచించడం ప్రారంభించారు. అంతిమంగా 1929 ఆగస్టు 3న నెదర్లాండ్స్‌లోని ఒమ్మెన్ నగరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది.  ఆర్డర్ ఆఫ్ ది స్టార్  వార్షిక సదస్సులో దాదాపు మూడు వేల మంది  ప్రతినిధుల సమక్షంలో కృష్ణమూర్తి ఆ సంస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. 

ఆ వేదికపై ఆయన చేసిన  సత్యం అనేది మార్గం లేని భూమి (Truth is a pathless land) ప్రసంగం తాత్విక  ప్రపంచాన్ని కుదిపివేసింది. ఏ మతం, ఏ గురువు, ఏ పూజా విధానం,  ఏ సిద్ధాంతం ద్వారా కూడా మానవుడు అంతర్గత సత్యాన్ని చేరుకోలేడని ఆయన స్పష్టం చేశారు.  నన్ను ఎవరూ అనుసరించవద్దు. మీరు నన్ను అనుసరించడం ప్రారంభించిన క్షణంలోనే సత్యాన్ని అన్వేషించడం విరమించినట్లు అవుతుందని  అని ఆయన ప్రపంచానికి   చెప్పారు.  తాను ఎలాంటి దేవుడినని గానీ, దైవ కుమారుడినని గానీ కృష్ణమూర్తి ఎన్నడూ చెప్పుకోలేదు. ఇతరులు ఆయనపై మోపిన  వరల్డ్ టీచర్ హోదాను జిడ్డు కృష్ణమూర్తి అత్యంత వినమ్రంగా..  పూర్తి స్పష్టతతో తోసిపుచ్చారు. బుద్ధుడు లేదా ఏసు క్రీస్తు వంటి ఆధ్యాత్మిక ప్రవక్తలకు పోటీగా ఆయన నిలబడలేదు.  కేవలం మానసిక భయాలు, జ్ఞాపకాలు, ఆలోచనా సరళి,  మానవ అంతరంగంలో చెలరేగే సంఘర్షణలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చిన ఒక స్వతంత్ర ఆలోచనాపరుడిగా మాత్రమే ఆయన కొనసాగారు. 

జిడ్డు కృష్ణమూర్తిని కేవలం ఒక మతానికి,  భారత సంప్రదాయానికి మాత్రమే పరిమితం చేయడం  సరికాదు. ఎందుకంటే ఆయన ప్రాచీన, ఆధునిక, పూర్వ, పాశ్చత్య వ్యవస్థలన్నింటిలో ఉన్న గుడ్డి నమ్మకాలను ఒకే రీతిలో ప్రశ్నించారు.  ఆధ్యాత్మిక ఆలోచనలకే పరిమితం కాకుండా.. విద్యారంగంలోనూ కృష్ణమూర్తి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ  పాఠశాల,  వారణాసిలోని రాజఘాట్ విద్యా సంస్థల స్థాపనకు ఆయనే మూలకారకుడు. కేవలం మార్కుల పోటీ, భయంతో కూడిన క్రమశిక్షణ కాకుండా..  పిల్లల్లో ప్రకృతి పట్ల అవగాహన, స్వతంత్రంగా ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడమే నిజమైన విద్య అని ఆయన బోధించారు. అదేవిధంగా రాజకీయంగా ఆయన ఏ పార్టీకీ మద్దతు ఇవ్వనప్పటికీ..  ఏ వ్యవస్థ అయినా వ్యక్తి స్వేచ్ఛను హరించి అంధ విధేయతను కోరితే అది బానిసత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు.  

ఒమ్మెన్ సమావేశంలో అధికారం, సంపద, లక్షలాది మంది అనుచరులు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటినన్నింటినీ త్యాగం చేసి ఒక సాధారణ తాత్వికుడిగా నిలబడిన జిడ్డు కృష్ణమూర్తి   చిరస్మరణీయుడు. ఆయనను దైవావతారంగా పూజించడం..  లేదా  నాస్తికుడిగా కొట్టిపారేయడం  ఆయన తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అవుతుంది. తనను గురువుగా కొలవవద్దని చెప్పిన మహనీయుడిని మళ్లీ ఒక గురువుగా మార్చి పూజించడం కంటే, ఆయన లేవనెత్తిన ప్రాథమిక ప్రశ్నలను మన అంతరంగంలో వేసుకొని మనల్ని మనం విశ్లేషించుకోవడమే జిడ్డు కృష్ణమూర్తికి ఇచ్చే నిజమైన నివాళి. 

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.      

Jiddu Krishnamurti, World Teacher, Theosophical Society, Annie Besant, Oommens speech

google-ad-img
    Related Sigment News
    • Loading...