మహిళలతో జేఈఎం ప్రత్యేక ఉగ్ర విభాగం.. ఐరాస సంచలన నివేదిక

posted on: Feb 12, 2026 11:59AM

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి  సంచలన నివేదిక విడుదల చేసింది. గత ఏడాది ఢిల్లీ  ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. , అలాగే  జేఈఎం ఉగ్రసంస్థ మహిళలతో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించింది.  ఐరాస భద్రతా మండలికి చెందిన ఆల్-ఖైదా, ఐసిస్ ఆంక్షల పర్యవేక్షణ బృందం రూపొందించిన ఈ నివేదికలో 2025 నవంబర్ 9న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన దాడి వెనుక ఉన్నది జేఈఎం ఉగ్రసంస్థేనని పేర్కొంది.  

 జైషే చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ 2025 అక్టోబర్ 8న జమాత్ ఉల్-ముమినత్ పేరుతో మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రకటించాడనీ, ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ  ఈ మహిళా ఉగ్ర విభాగం ఏర్పాటైందని పేర్కొంది. ఈ నివేదిక మరో సంచలన విషయాన్ని కూడా వెల్లడించింది.  జేఈఎం ఉగ్ర సంస్థ నిర్వీర్యమైపోయిందని పాకిస్థాన్ (పేరు ప్రస్తావించకుండా, ఒక సభ్యదేశం అని పేర్కొంది) చేసిన ప్రకటన పూర్తి అవాస్తవం అని ఐరాస నివేదిక విస్పష్టంగా పేర్కొంది.   జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఇప్పటికీ చురుకుగా కార్యకలాపాలు సాగిస్తోందని, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఐరాస నివేదిక పేర్కొంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...