నాలుగు దశాబ్దాల బంధం.. తెగిపోయింది
posted on: Mar 25, 2014 7:04AM
.jpg)
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని కష్టకాలంలో కూడా ఏనాడూ పార్టీ గీత దాటని జేసీ కుటుంబం ఎట్టకేలకు ఆ పార్టీని వీడింది. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా ఇన్నాళ్లు నిలిచిన జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘబంధాన్ని తెంచుకున్నారు. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన సమయంలోనూ కాంగ్రెస్‌లోనే కొనసాగిన జేసీ కుటుంబం ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పేసింది. జేసీ దివాకరరెడ్డి తండ్రి నాగిరెడ్డి ఆ పార్టీ తరఫున చాలా కాలం క్రితం రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన దివాకరరెడ్డి 1972లో మొదటిసారి సమితి అధ్యక్షునిగా గెలుపొందారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో తాడిపత్రి నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేశారు. ఆయనకు రెండో స్ధానం వచ్చి కాంగ్రెస్ అభ్యర్థికి మూడో స్ధానం వచ్చింది. టీడీపీ ఆ ఒక్కసారే అక్కడ గెలిచింది. 1985లో కాంగ్రెస్ టికెట్టు పొందిన జేసీ అప్పటి నుంచి 2009 దాకా ప్రతి ఎన్నికలో గెలుస్తూ వచ్చారు.
కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయాల్లో కొన్నిసార్లు అసంతృప్త నేతగా ఉన్నా దివాకరరెడ్డి గతంలో ఎప్పుడూ పార్టీని వీడే యోచన చేయలేదు. కోట్ల వర్గంలో ఉన్న ఆయన అప్పట్లో వైఎస్‌పై తీవ్ర స్ధాయిలో పోరాడారు.వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత రాజీపడ్డారు. కానీ వైఎస్ కుటుంబంతో దూరం కొనసాగుతూ వచ్చింది. ఆ కారణం వల్లే ఆయన వైసీపీ వైపు చూడకుండా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌తో పూర్తిగా విభేదించి ఇప్పుడు బయటకు వచ్చేశారు.
జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం టీడీపీతో పోరాటం చేసిన ఆయన ఆ పార్టీలో చేరటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకించి టీడీపీలో కొందరు ఆయన రాకను వ్యతిరేకించారు. కానీ దివాకరరెడ్డి తన లౌక్యంతో వారిని సమాధానపర్చగలిగారు.'టీడీపీ నా వద్దకు రాలేదు. నేనే టీడీపీ వద్దకు వెళ్లాను' అని ఆయన చేసిన ప్రకటన జిల్లాలో టీడీపీ నాయకులను శాంతపర్చింది.



.jpg)
.jpg)
.webp)

.webp)


