కాంగ్రెస్ పార్టీని వీడట్లేదు: జయసుధ
posted on Jun 23, 2015 2:09PM
(1).jpg)
కాంగ్రెస్ పార్టీని విడిచి తెరాసలో జేరబోతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను జయసుధ ఖండించారు. ఆమె తెరాసలో చేరాలనే ఆలోచనతో ఉన్నందునే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని భావించిన తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని భావించినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. అందుకే ఆమె ఈరోజు ఆయనను కలిసి వివరణ ఇచ్చుకొన్నారు. అటు సినిమాలతో, సేవా కార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నందునే తను పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గోనలేకపోతున్నానని, త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అవసరమయితే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు తను ఏవిధమయిన సేవలు అందించడానికయినా సిద్దమని తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టాలని ఎన్నడూ అనుకోలేదని స్పష్టం చేసారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె పనిచేయదలిస్తే తన సికిందరాబాద్ నియోజకవర్గం వరకయితే పరువాలేదు. కానీ ఆమె ఆంధ్రా మూలాల కారణంగా తెలంగాణాలో మరే ప్రాంతంలో ప్రజలను మెప్పించడం చాలా కష్టమే. ఇక ఆంధ్రా విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ అంతటి వాడు గత ఏడాది కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించలేకపోయానని చెప్పి దానికో నమస్కారం పెట్టేసి వైకాపాలో చేరిపోయారు. అటువంటప్పుడు జయసుధ వచ్చి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బ్రతికించగలరా?