జయ ఎస్టేట్ : దొరలు, దొంగలు, దోపీడీలు అండ్ మిస్టరీ!
posted on May 5, 2017 10:06AM

జయలలిత అంటే ఓ గ్లామర్, ఓ పొలిటికల్ ఇమేజ్ మాత్రమే కాదు. ఆమె అమ్మగా తమిళ ప్రజలకు ఆరాధ్య దైవం అయ్యారు. తనని వ్యతిరేకించిన, ఎదురించిన వారికి పీడకల కూడా అయ్యారు! కాని, ఇదంతా పైకి కనిపించేదే. సామాన్య జనానికి ఇంత కాలం తెలియని ఎన్నో రహస్యాలు ఒక్కోటి ఇప్పుడు బయటకొస్తున్నాయి! మరీ ముఖ్యంగా, అమ్మకు, చిన్నమ్మకు మధ్య కొనసాగిన ఆర్దిక, అవినీతి అనుబంధాలు అందర్నీ షాక్ కి గురి చేస్తున్నాయి!
జయ మరణంతో ఖాళీ అయిన సీఎం కూర్చీలో కుర్చుందామనుకున్న శశికళ ఇప్పుడు జైల్లో వుంది. అలా జరగటానికి కారణాలు బోలెడు. అవన్నీ మనకు తెలిసినవే. అయితే, చిన్నమ్మ జయమ్మ అనుబంధంలోని కొత్త కోణం ఎస్టేట్ లో బయటపడింది! అదీ దోపిడీ దొంగల వాంగ్మూలంలో! వినటానికే విచిత్రంగా వున్న ఈ వ్యవహారమంతా ఏదో సినిమా కథలా నడుస్తోంది! సరిగ్గా అలాంటి నిజాలు, అలాంటి అనుమానాస్పద మరణాలే చోటు చేసుకుంటున్నాయి!
కొన్నాళ్ల క్రితం కొడనాడు అనే ప్రాంతంలోని జయలలిత ఎస్టేట్ లో దొంగలు పడ్డారు. వాచ్ మెన్లపై దాడి చేసి మరీ నగలు, డబ్బులు, దస్తావేజులు ఎత్తుకెళ్లారు! శశికళ జైల్లో వుండగా, దినకరణ్ పోలీస్ కస్టడీలో వుండగా ఇదంతా జరుగుతుండటం అనుమానాస్పదమే! అయినా యధవిధిగా దర్యాప్తు చేసిన పోలీసులు అనుకోని నిజాలు కనుక్కోగలిగారు! జయలలిత ఎస్టేట్ దోచుకున్న దొంగల్లో ఇద్దరు చిల్లర దొంగలు కేరళలో కార్లు దొంగిలిస్తూ పట్టుబడ్డారు. వారిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే దిమ్మతిరిగే విషయాలే బయటకొచ్చాయి!
కేరళ పట్టుబడ్డ ఇద్దరూ దొంగలు జయలలిత ఎస్టేట్ దోచిన పదకొండు మందిలో భాగం. అయితే, వారిది అసలు పాత్ర కాదట. జయలలిత వద్ద గతంలో కార్ డ్రైవర్ గా పని చేసిన కనకరాజ్ దొంగల ముఠా లీడరంటున్నారు. జయలలిత మరో మాజీ డ్రైవర్ నయాన్ కూడా ఎస్టేట్ దోచుకోవటంలో కీలకపాత్ర పోషించాడట. ఈ డ్రైవర్లు ఇద్దరూ మిగతా అందరితో కలిసి మొత్తం 11మంది దోపీడికి వెళ్లారు. ఎస్టేట్ ను కాపలాకాస్తున్న వాచ్ మెన్లను చితకబాదారు. లోనికి వెళ్లి అందినంతా దోచుకున్నారు. అయితే, చివర్లో డ్రైవర్ కనకరాజ్ సినిమా టైపులో మోసం చేశాడు ఇతర దొంగల్ని! రెండు లక్షలు చేతిలో పెట్టి నోరు మూసుకుని పొమ్మన్నాడు. వేషాలేస్తే పెద్ద పెద్ద వారి ప్రమేయం జయలలిత ఎస్టేట్ దోపీడీలో వుందనీ, వారు చూసుకుంటారని అన్నాడు. చేసేది లేక రెండు లక్షలు తీసుకుని వెళ్లిపోయిన చిల్లర దొంగలే ఇప్పుడు పోలీసులకి దొరికారు!
క్రైమ్ సినిమాల్లో మాదిరిగా ఇప్పటికే జయ ఎస్టేట్ దోపిడికి ప్లాన్ చేసిన మాజీ డ్రైవర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇంకో డ్రైవర్ అనుమానాస్పదంగా యాక్సిడెంట్ అయ్యి చికిత్స పొందుతన్నాడు! ఇంత దారుణం తమిళనాడు ప్రభుత్వంలోని ఒక మంత్రే జరిపించాడని కూడా టాక్ వినిపిస్తోంది. అతడికి త్వరలోనే నోటీసులు వెళ్లొచ్చని అంటున్నారు. ఇంతకీ, ఇంత రిస్క్ దొంగలు, దొరలు అందరూ ఎందుకు తీసుకుంటున్నారు? ఈ కొశన్ కి యాన్సర్ జయలలిత ఎస్టేట్ లో దొరికిన కోట్లు విలువ చేసే డబ్బు, భూమి కాగితాలు, నగలే! జయ, శశికళ రూముల్లో సదరు ఎస్టేట్ లో కుప్పలు కుప్పలుగా డబ్బులు, డాక్యుమెంట్స్, నగలు దొరికాయట! ఇంకేం కావాలి… మాంచి క్రైమ్ స్టోరీ నడవటానికి?