అప్పుడే ఏడాది.. తమిళనాడుకు తీరని లోటు..

 

డిసెంబర్ 5 ఈరోజు ఏంటో తెలియకపోవచ్చు కానీ.. కాస్త పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్లకు మాత్రం అర్దమవుతుంది. ఈరోజే... తమిళనాడు రాజకీయాల్లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని.. తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని నిరూపించిన.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి.. తమిళుల ఆరాధ్య దైవం జయలలిత మరణించిన రోజు. గత ఏడాది ఈరోజు.. తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది. తమిళ ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించిన రోజు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన రోజు. సంవత్సరం గడుస్తున్నా రాష్ట్రంలో ‘అమ్మ’ లేని లోటు అలాగే ఉంది. ఆమె మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి చోటుచేసుకుంది. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

 

అమ్మ మరణానంతరం శశికళ తనలోని మరో రూపాన్ని చూపించింది. జయ ఉన్నంత కాలం సైలెంట్ గా ఉన్న ఆమె.. పదవి చేపట్టాలని బాగానే ప్రయత్నించారు. పార్టీపై పట్టు బిగించేందుకు ప్రయత్నించారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఇక సీఎం పగ్గాలు కూడా చేపడదామనుకున్న ఆమెకు..జయలలిత నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వం అడ్డుతగిలాడు. ఇక అప్పటినుండి.. అన్నాడీఎంకేలో అధికార పోరు జరుగుతూనే ఉంది. ముందు పన్నీర్ సెల్వం వర్గం... శశికళ వర్గం ఉండేది. ఆ తరువాత.. శశికళ సీఎంగా నియమించిన పళనిస్వామి కూడా ఎప్పుడైతే అక్రమాస్తుల కేసులో భాగంగా శశికళ జైలుకు వెళ్లిందో.. తనకు వ్యతిరేకంగా మారాడు. ఇక దాని తరువాత పన్నీర్ సెల్వం.. పళనివర్గాలు కలిసిపోయాయి. ఇక జైల్లో ఉండే... తన మేనల్లుడు దినకరన్ తో చక్రం తిప్పుదామని చూసింది. అది కూడా బిస్కట్ అయింది. పార్టీ గుర్తు వార్ లో దినకరన్ లంచం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఆ తరువాత ఆమెకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మరోవైపు ఇదే అదనుగా చూస్తున్న బీజేపీ, డీఎంకేలు తమిళనాడులో పట్టు పెంచుకునేందుకు  పావులు కదుపుతున్నాయి.

 

ఇంకా ఎన్నో మార్పులు వచ్చాయి జయ మరణానంతరం... జయ సీఎంగా ఉన్నన్నాళ్లూ ఉన్నామా, లేమా అన్నట్టుగా ఉన్న ఐటీ శాఖ ఒక్కసారిగా జూలు విదిల్చింది. వీఐపీలు సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసంలోనే సోదాలు చేపట్టింది. తమిళనాడు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఐటీ శాఖ సచివాలయంలో దాడులు నిర్వహించడం అదే తొలిసారి. అంతేనా.. జయలలిత బతికి ఉండగా తాము జయలలిత వారసులమని ఒక్కరు కూడా బయటకు రాని వారు ఆమె మరణంతో కలుగులోని ఎలుకల్లా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆమెకు అసలైన వారసులం తామేనని ప్రకటించి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇప్పుడు బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల తాను జయ కుమార్తెనంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం సూచన మేరకు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

 

ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్నది మాత్ర నిజం. తాను చనిపోయిన ఏడాది గడుస్తున్న తమిళనాడు రాజకీయాల్లో ఇంకా స్తబ్దత.. అయోమయం ఉన్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఆ స్థాయి నేత కరువయ్యారు. ఇప్పుడు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తున్నామని చెప్పినా.. ఆమెలాగా చెరగని ముద్ర వేయడం చాలా కష్టం. తమిళనాడు ఆమె ఒక తీరని లోటు..