ఈ ఏడుపు సీన్ ఏంటండీ బాబు!
posted on Mar 23, 2014 3:39PM

వయసొస్తే సరిపోదు.. వయసుకు తగ్గ పరిపక్వత కూడా వుండాలి. ప్రస్తుతం వున్న పొలిటికల్ సిట్యుయేషన్‌లో ఈ సలహా తీసుకోవడానికి నూటికి నూరుపాళ్ళు అర్హుల్లో ముందు వరసలో వుండేది ఎవరయ్యా అంటే, బీజేపీ సీనియర్ నాయకుడు జస్వంత్ సింగ్. ఏనాడో ఏడుపదులు దాటిపోయిన జస్వంత్ సింగ్ ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి లాంటి పదవులని బోలెడన్నిసార్లు అనుభవించేశాడు. అయినా సరే మరోసారి ఎంపీ టిక్కెట్ రాలేదని భోరున ఏడ్చేశాడు. భారతీయ జనతాపార్టీ ప్రస్తుతం కొత్త రక్తం ఎక్కించుకునే పనిలో వుంది. అందులో భాగంగా జస్వంత్ సింగ్ లాంటి వృద్ధ జంబూకాలకి టిక్కెట్లు ఇవ్వకూడదని డిసైడ్ చేసింది. దాంతో జస్వంత్ సింగ్ చెలరేగిపోయాడు. ఠాఠ్ నాకు టిక్కెట్ ఇవ్వరా అంటూ ప్రెస్‌మీట్ పెట్టిమరీ పార్టీ ఎన్నికల కమిటీని ఎదిరిస్తూ మాట్లాడాడు. మాట్లాడ్డంతో ఆగితే బాగానే వుండేది, ఆ ప్రెస్‌మీట్‌లోనే భోరున ఏడవటం మొదలెట్టి కన్నీళ్ళు తుడుచుకున్నాడు. జస్వంగ్ సింగ్ లాంటి పెద్దమనిషి ఎన్నికల్లో టిక్కెట్ రాలేదని ఇలా ఏడవటం చూసి అక్కడున్నవాళ్ళంతా ముక్కున వేలేసుకున్నారు. కాసేపు ఏడిచి కళ్ళు తుడుచుకున్న తర్వాత తేరుకున్న జస్వంత్ సింగ్ భాజపా టిక్కెట్ ఇవ్వకపోయినా పర్లేదని, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించాడు. ఈ ఏడుపేదో భోరున ఏడవకముందు ఏడిస్తే బాగుండేది కదా అని అక్కడున్న అందరూ అనుకున్నారు!