ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కన్నీటి కడలి.. రక్తం ఓడుతున్న దేశ భవిష్యత్తు.!

posted on: Jul 24, 2026 7:22PM

 

ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు.. అవి దేశ భవిష్యత్తుగా వెలగాల్సిన యువత కన్నీళ్లతో, ఆవేదనతో తడిసి ముద్దవుతున్నాయి. తమ కలలను, భవిష్యత్తును అమ్ముకుంటున్న విద్యా మాఫియాపై ప్రశ్నించడానికి వచ్చిన పసిపిల్లల లాంటి విద్యార్థులపై జరిగిన క్రూరత్వానికి అక్కడ చిందిన రక్తపు బొట్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నీట్ పరీక్షల అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలతో తమ జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని రోడ్డుపై కూర్చున్న ఆ యువత కళ్లల్లో ఆక్రోశం, గుండెల్లో రగులుతున్న వేదన వర్ణనాతీతం. ఈ అంశంపై టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర చర్చ జరిగింది.

ఏళ్ల తరబడి రెక్కలు ముక్కలు చేసుకుని చదువుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల భవిష్యత్తును రూ.40 లక్షలకు పేపర్లు అమ్ముకునే ముఠాలు నడిరోడ్డుపై బజారున పడేశాయి. కంటిమీద కునుకు లేకుండా రోజుకు 16 గంటలు శ్రమించిన విద్యార్థికి ఈరోజు మిగిలింది కేవలం నిరాశ, మానసిక నరకం. "మా పిల్లలు రేపు ఉదయానికి ఏమైపోతారో, ఏ ఆత్మహత్యకు ఒడిగడతారో" అని భయంతో వణికిపోతున్న తల్లిదండ్రుల గుండెకోత ఏ ప్రభుత్వాలకైనా కనిపిస్తోందా? ఒక్క మార్కు పోతేనే ప్రాణాలు తీసుకునేంతటి ఒత్తిడిలో ఉన్న పిల్లలు, తమ కష్టమంతా కాగితాల లీకేజీలతో బూడిదపాలుకావడం చూసి ఏ స్థితికి చేరుకుంటారో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది.

అంతటి తీవ్ర వేదనలో కూడా ఎటువంటి హింసకు తావులేకుండా, శాంతియుతంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులపై ప్రదర్శించిన రాక్షసత్వం సభ్య సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఏ నేరం చేశారని ఆ ముక్కుపచ్చలారని పిల్లలపై పశువులకంటే హీనంగా లాఠీలు ఝళిపించారు? ముఖాలకు మాస్కులు ధరించి, సివిల్ దుస్తుల్లో వచ్చిన అజ్ఞాత వ్యక్తులు విద్యార్థులపై విరుచుకుపడి, కాళ్లు చేతులు విరగ్గొడుతుంటే రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం ఏమైపోయింది? నడిరోడ్డుపై ఆడపిల్లల దుస్తులు చిరిగిపోయేలా ఈడ్చిపారేస్తుంటే, తమ హక్కుల కోసం ప్రశ్నించడమే ఆ పిల్లలు చేసిన పాపమా? తమ భవిష్యత్తు కోసం నిలబడ్డ అమాయకులను తీవ్రవాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కంటే దారుణం మరొకటి ఉందా?

ఈరోజు దేశంలో విద్య, వైద్యం కార్పొరేట్ రాబందుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోవడమే కాకుండా, కష్టపడి పైకి వద్దామనుకున్న ప్రతిసారీ ఈ ప్రశ్నాపత్రాల లీకేజీల రూపంలో వారి కలలను నలిపివేస్తున్నారు. ఒక పక్క లీకేజీ మాఫియా కోట్లు సంపాదిస్తుంటే, మరోపక్క ఆత్మన్యూనతా భావంతో అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శనగపిండి, ఉల్లిపాయలు తింటూ రోడ్లపై రాత్రంతా నిద్రలేని గడుపుతున్న ఆ విద్యార్థుల కళ్లలోని కన్నీరు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల వైఫల్యానికి నిలువుటద్దం.

కేవలం కంటితుడుపు చర్యగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? ఆవేదనతో రగిలిపోతున్న విద్యార్థులకు, భయంతో విలవిలలాడుతున్న తల్లిదండ్రులకు ఎవరు హామీ ఇస్తారు? అధికారులు, పాలకులు తమ అహంకారాన్ని, ఇగోలను పక్కనబెట్టి ఒక మానవీయ కోణంలో ఈ సమస్యను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి వెన్నెముక లాంటి యువతను రోడ్లపై రక్తం ఓడేలా కొట్టించి, వారి ఆక్రందనను తొక్కేయాలని చూస్తే అది రాబోయే రోజుల్లో వ్యవస్థల ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పటికైనా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వినాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారికి న్యాయం జరిగి తీరాలి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...