పవన్‌ సభతో తెదెపాకే లాభం!

posted on: Nov 11, 2016 1:26PM

 

పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సభ పెట్టారు. ఈసారి అనంతపురం వేదికగా సాగిన ఈ సభకి కూడా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పుడిప్పుడే పవన్‌ సభలకు అలవాటుపడుతున్న మిగతా ప్రజలు ఈసారి పవన్‌ సభ పట్ల అంతగా ఆసక్తి చూపినట్లు లేదు. పైగా వాళ్లిప్పుడు నోట్ల కష్టంలో ఉన్నారు. కానీ పవన్‌ అనంతపురం సభ విశ్లేషకులను మాత్రం విశేషంగానే ఆకర్షించింది. మిగతా సభలతో పోలిస్తే ఈసారి తెదెపా మీద పవన్‌ దూకుడు పెరిగినట్లే కనిపించింది. తెదెపా పాలనలో అవినీతి పెరిగిపోతోందన్న మాట వినిపిస్తోందని, వెనుకబడిన జిల్లాల పట్ల మరింత శ్రద్ధ చూపాలనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనీ... ఇలా అధికార పక్షం మీద సుతిమెత్తటి విమర్శలు ఈసారి చోటు చేసుకున్నాయి.

 

తాను అనంతపురంలోనే జనసేన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తానని, ఇక్కడి నుంచే తన పోరాటాన్ని ప్రారంభిస్తానని కరతాళ ధ్వనుల మధ్య పవన్‌ పేర్కొన్నారు. కానీ పవన్‌ తన తెదెపా గురించి చేసిన విమర్శల వల్ల ఆ పార్టీకి పెద్దగా నష్టం లేదంటున్నారు విశ్లేషకులు. రోజులు గడుస్తున్న కొద్దీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదన్న విషయం తేలిపోయింది. మరోవైపు రాజధాని నిర్మాణం చాలా మందకొడిగా సాగుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెదెపా పాలన పట్ల ప్రజలలో కాసింత నిరాశ చోటుచేసుకుంటోంది. అసలే రాజధాని విషయంలో గుర్రుగా ఉన్న రాయలసీమలో ఈ పరిస్థితులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. పవన్‌ అనంతపురం పర్యటనతో ఇలాంటి భావాలు సద్దుమణిగిపోక తప్పదు. మీ తరఫున పోరాడటానికి నేనున్నానంటూ పవన్‌ వంటి వ్యక్తి ముందుకు వస్తే అక్కడి ప్రజల్లో అసమ్మతి తగ్గి ఆశలు రేగడం ఖాయం. పవన్‌ తనన ప్రసంగంలో వేర్పాటువాదాలొస్తాయంటూ చేసిన హెచ్చరికలు ఈ వాదానికి బలం చేకూరుస్తున్నాయి.

 

పవన్‌ నిజంగానే ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపాలనుకుంటే పోరాడేందుకు చాలా సమస్యలు ఉన్నాయి. రాజధాని భూములు, భీమవరం దగ్గర ఆక్వాఫుడ్‌ ప్రాజెక్టు... ఇలా చాలా విషయాలకు సంబంధించి పవన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించి వదిలేశారు. కేవలం ప్రత్యేక హోదా గురించే గట్టిగా మాట్లాడుతున్నారు. దీని వలన ఇప్పుడిప్పుడే ఆంధ్రరాష్ట్రంలో వెంకయ్యనాయుడుగారిని ముందుంచుకుని బలపడదామనుకునే భాజపా పార్టీకి నష్టం కలుగుతోందే కానీ తెదెపాకు కాదు. అందుకేనేమో లోకేష్ బాబు నిన్నటి అనంతపురం సభ గురించి మాట్లాడుతూ ‘పవన్‌ వ్యాఖ్యలను పాజిటివ్‌గానే తీసుకుంటాం’ అంటూ మురిసిపోయారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...