పొన్నాల, జానా పనికిమాలిన పంచాయితీ

posted on: May 5, 2014 4:08PM

 

 

 

ఏదైనా పనికొచ్చే విషయం మీద పంచాయితీ పెట్టుకుంటే, సదరు పంచాయితీ పెట్టుకున్నవాళ్ళతోపాటు చూసేవాళ్ళకి కూడా ఒక పద్ధతిగా వుంటుంది. కానీ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి మధ్య జరుగుతున్న పంచాయితీని చూస్తే ఎవరైనా సరే ఇది పనికిమాలిన పంచాయితీ అని డిసైడ్ చేస్తారు. ఇంతకీ వీరిద్దరి మధ్య పంచాయితీ ఏంటంటే, తెలంగాణకి కాబోయే సీఎం నువ్వా? నేనా? అని! తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబట్టి తానే సీఎం అయిపోతానని పొన్నాల కలలు కంటున్నారు. కానీ జానారెడ్డి మాత్రం తానే సీఎం కాబోతున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

 

ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి పేరు మరొకరు చెప్పకుండా ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. వీళ్ళని చూసి దామోదర రాజ నరసింహ లాంటి సీఎం పోస్టుని ఆశిస్తున్న వారు ఏం చేయాలో అర్థంకాక ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌కే మెజారిటీ దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినా కాంగ్రెస్ చేతికి చిప్పే దక్కుతుందని తెలుస్తోంది.



అసలు అధికారం వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వుంటే, మధ్యలో ముఖ్యమంత్రి సీటు గోలేంటని కొందరు కాంగ్రెస్ వాదులు చిరాకు పడుతున్నారు. అలాగే యువరాజు రాహుల్ గాంధీ తెలంగాణకి మహిళని ముఖ్యమంత్రిని చేస్తానని ఆల్రెడీ చెప్పేశారు. అలాంటప్పుడు ఈ ఇద్దరు మగానుభావులు తెలంగాణ పోస్టుకోసం పోటీ పడటం ఏంటని కొందరు కాంగ్రెస్ మహిళా నాయకులు బాధపడిపోతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...