జమ్మలమడుగులో ఉద్రిక్తత..వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

posted on: Jul 1, 2026 8:55PM

 

ఎంతోకాలంగా కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రజలు ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమకు ఈ నెల 3న శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును పరిశీలించేందుకు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన పనుల పురోగతిని పరిశీలించాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ బృందం జమ్మలమడుగుకు చేరుకుంది.

అయితే, వైసీపీ కార్యాలయం నుంచి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టు ప్రాంతానికి బయలుదేరిన నాయకులను స్థానిక నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన స్టీల్ ప్లాంట్‌ను ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రారంభిస్తున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన క్రెడిట్‌ను దక్కించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులకు పర్యటించే హక్కు ఉందని, పోలీసుల చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...