జైల్లో పుట్టిన ప్రేమ ...పెరోల్‌పై ఖైదీల పెళ్లి
posted on: Jan 23, 2026 7:48PM

హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల మధ్య జైల్లో పుట్టిన ప్రేమ, చివరకు పెళ్లి వరకు వెళ్లింది. రాజస్థాన్‌లోని జైపూర్ సంగనేర్ ఓపెన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రియాసేథ్, హనుమాన్‌ప్రసాద్‌లు తమ ప్రేమ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేశారు. పెళ్లి చేసుకోవాలని వారు కోర్టును ఆశ్రయించగా, రాజస్థాన్ హైకోర్టు వారికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఆ మేరకు ఇద్దరూ జైలు నుంచి బయటకు వచ్చి, అల్వార్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి పూర్తయిన అనంతరం కొద్ది రోజుల్లోనే మళ్లీ జైలు గూటికి చేరనున్నారు.
ప్రియాసేథ్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడిని ఇంటికి పిలిచి, తన ప్రేమికుడు, మరో స్నేహితుడితో కలిసి కిడ్నాప్ చేసింది. తన ప్రియుడి అప్పులు తీర్చడానికి బాధితుడి తండ్రికి ఫోన్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. అయితే అతను రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడు. విషయం బయటపడుతుందనే భయంతో యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి కొండ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక హనుమాన్‌ప్రసాద్ మరో కేసులో ఒక వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నారని భావించి, ఆమె భర్తను, పిల్లలను, వారితో ఉంటున్న మరో బంధువును వేట కొడవలితో నరికి చంపాడు. ఈ కేసులో హనుమాన్‌ప్రసాద్‌తో పాటు ఆ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇలా ఘోరమైన హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ ఇద్దరి మధ్య జైల్లో పుట్టిన ప్రేమ, చివరకు పెరోల్‌పై పెళ్లి వరకు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.


.webp)
.webp)


