దిగంబరంగా వచ్చి... దడదడలాడించిన స్వామీజీ!

posted on: Aug 28, 2016 11:31AM

అసెంబ్లీలో ఏం చేయొచ్చు? చర్చలు చేయొచ్చు! చట్టాలు చేయొచ్చు! చాణక్యం చేయొచ్చు! ఇంతే కాని ఇంకేం చేయొచ్చు అనకండి! ఎందుకంటే, అసెంబ్లీల్లో ఏమేం చేయొచ్చొ ఈ మధ్య చాలా మందే చేసి చూపించారు! కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు, బూతు తిట్టుకోవచ్చు, దారుణంగా సైగలు చేసుకోవచ్చు! ఇలా ఏదైనా చేయొచ్చు! చివరకు, సెల్ ఫోన్లలో బ్లూ ఫిల్మ్ లు కూడా చూడొచ్చు! ఇక పార్లమెంట్లో అయితే పెప్పర్ స్ప్రేలు కొట్టుకునే దాకా వెళ్లింది ప్రజాస్వామ్యం! ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్లో ఏం చేయొచ్చు అనే చర్చ ఎందుకంటే... హర్యాణా అసెంబ్లీలో ఒక జైన సన్యాసి ప్రసంగించారు! అది మహా పాపమైపోయిందట కేజ్రీవాల్ గారి ఆప్ పార్టీకి! ఆప్ నేతలతో కలిసి మరి కొంత పాప్ లు కూడా రంగంలోకి దిగారు! పాపులంటే కేవలం హిందు మతాన్నే టార్గెట్ చేసే ఇండియాలోని సెక్యులర్ ఛాందసవాదులు! 


ఒక సన్యాసి అసెంబ్లీలోకి వచ్చి ప్రసంగించటం మన లౌకిక దేశంలో తప్పే! కాని, ఏ ఇతర మతానికో చెందిన మరో మత గురువు వస్తే పెద్దగా గొడవుండదు. బీజేపి పాలిత రాష్ట్రంలో హిందు లేదా బౌద్ధ లేదా జైన గురువు అసెంబ్లీలోకి వస్తే మాత్రం ఇక అంతే సంగతులు! ఇప్పుడు అదే జరుగుతోంది జైన గురువు తరూణ్ సాగర్ విషయంలో! ఆయన గురించి మన అభ్యుదయవాదులు రెచ్చిపోవటానికి కారణం ఆయన జైన గురువు కావటమే కాదు దిగంబర సన్యాసి కూడా! 


ఒక బట్టల్లేని జైన సన్యాసిని అసెంబ్లీలోకి బీజేపి ప్రభుత్వం పిలిచింది అంటూ ఆప్ పార్టీ వాళ్లు నానా యాగీ చేస్తున్నారు! దాంట్లో వాళ్లకు ఏం సెక్యులర్ లాజిక్ కనిపించిందో కాని బుద్ది వున్న ప్రతీ వాళ్లు ఈసడించుకుంటున్నారు! జైన మతంలో దిగంబర సంప్రదాయం అనాదిగా వుంది. దాన్ని పాటించే సన్యాసిని అసెంబ్లీలోకి పిలిస్తే అది ఎలా అపవిత్రం అవుతుంది? కేజ్రీవాల్ గారి గ్యాంగ్ కే తెలియాలి!


బట్టలు వేసుకోకున్నా జైన సాధువు తరూణ్ సాగర్ అన్నీ మంచి మాటలే చెప్పారు. ఆడపిల్లల్ని బతికించుకోమన్నారు. సాక్షి, సింధు లాంటి ఛాంపియన్స్ ని మెచ్చుకున్నారు. పాకిస్తాన్ ని తప్పుపట్టారు. రాజకీయ నేతలకి చురకలు వేశారు. రాజకీయాన్ని ధర్మం శాసించాలని నీతి చెప్పారు. ఇవేవీ పట్టని కొందరు రాజకీయ నేతలు, సో కాల్డ్ మేధావులు మాత్రం తరూణ్  సాగర్ దిగంబరంగా అసెంబ్లీలోకి ఎందుకు వచ్చారన్న పాయింట్ దగ్గరే ఆగిపోయారు! పైగా దాన్ని వాళ్లు సెక్యులర్ ముసుగులో గొప్ప పనిగా బావిస్తున్నారు!

google-ad-img
    Related Sigment News
    • Loading...