ఎరక్కపోయివెళ్ళాడు.. ఇరుక్కుపోయాడు...

posted on: May 21, 2014 3:53PM

 

 

 

వైసీపీ నాయకులు వైఎస్ జగన్ ఇప్పుడు ఇంట్లో కూర్చుని ‘ఎరక్కపోయి వెళ్ళాను.. ఇరుక్కపోయాను’ అని పాటలు పాడుకుంటున్నాడు. ఇంతకీ జగన్ వెళ్ళింది ఎక్కడికి? ఇంకెక్కడికి? ఢిల్లీకి.. నరేంద్రమోడీ దగ్గరకి! ఎన్నికల ప్రచారంలో కేంద్రంలో ఏ ఎల్లయ్య, పుల్లయ్య అధికారంలోకి వచ్చినా మన దగ్గరకి మద్దతు కోసం రావాల్సిందే అని ప్రగల్భాలు పలికిన జగన్ కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ వుండటం, ఆంధ్రప్రదేశ్‌లో తన వైసీపీ చతికిలపడటంతో బిత్తరపోయాడు.

 

అంతలోనే తమాయించుకుని చేత్తో బొకే పట్టుకుని, ఎనిమిది మంది ఎంపీలను వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడకి వెళ్ళి మోడీకి బొకే ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తే సరిపోయేది. మోడీ గవర్నమెంట్‌కి అంశాలవారీ మద్దతు ఇస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. జగన్ ఏదో తెలియక అలా చెప్పాడులే అని బీజేపీ నాయకత్వం విని ఊరుకోలేదు. మీ సపోర్టు మాకు అక్కర్లేదని వెంటనే చెప్పేసింది. దాంతో గతుక్కుమనడం జగన్ వంతయింది. మొత్తమ్మీద ఈ ఇష్యూలో జాతీయ స్థాయిలో జగన్ పరువు ఏదైనా వుంటే అదంతా తుడిచిపెట్టుకునిపోయింది.

అంతేకాకుండా జగన్ తన మీద వున్న కేసుల నుంచి తప్పించుకోవాలనికే మోడీని కలిశాడన్న విషయం అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. జగన్‌ని మోడీ పట్టించుకోలేదు కాబట్టి త్వరలో జగన్ అరెస్టు కావడం ఖాయమన్న అభిప్రాయాలు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. టోటల్‌గా ఇప్పుడు జగన్ అనవసరంగా ఢిల్లీవెళ్ళి వివాదాల్లో ఇరుక్కుపోయానే అని జగన్ అంతర్మథనం చెందుతున్నట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...